బయో ఆసియా సదస్సులో భాగంగా ప్రపంచ ఆరోగ్యరంగాన్ని, మానవ జీవనశైలిని సాంకేతికత ఏవిధంగా ప్రభావితం చేస్తుందనే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ వర్చవల్ చర్చలో పాల్గొన్నారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో మానవ జీవనశైలిపై మహమ్మారి విసిరిన సవాళ్లు, సాంకేతికత తోడుగా సమస్యలను ఎదుర్కొనేందుకు ఉన్న పరిష్కారాలపై మంత్రి కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సత్యనాదెళ్ల సమాధానాలిచ్చారు. వ్యాధినిరోధక శక్తి వైరస్ చర్యలకు ఏవిధంగా స్పందిస్తుందనే సమాచారం వ్యాక్సిన్ అభివృద్ధిలో ఏ విధంగా కీలకమో... ప్రపంచం ఎదుర్కొనే అనేక సవాళ్లకు అందివచ్చిన నూతన టెక్నాలజీ పరిష్కారాలు చూపెడుతుందన్నారు.
ఆ మూడింటితోనే సమర్థులుగా మారతాం..
కొవిడ్ లాంటి గ్లోబల్ సవాళ్లకు... ఒక సొసైటీగా కమ్యునిటీ పరిష్కారాలు అవసరమవుతాయని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. సామాన్యుల జీవితాలను ప్రభావితం చేయగలిగే సాంకేతికత అవసరమన్న మంత్రి కేటీఆర్... ఈ విషయంలో ఎటువంటి చొరవ అవసరమని సత్య నాదెళ్లను ప్రశ్నించారు. నాలెడ్జ్ వర్కర్లతో పాటు... ఫ్రంట్ లైన్ వర్కర్లకు సాంకేతికత ఎనేబుల్ చేయటం సవాల్‌తో కూడిందని సత్య నాదెళ్ల బదులిచ్చారు. ఈ తరుణంలో సహకారం, సమర్థత, నేర్చుకోవడం.. ఈ 3 అంశాలే మనల్ని మరింత సమర్థులుగా నిలబెడుతుందని తెలిపారు. తెలంగాణలో స్టార్టప్ ఎకోసిస్టంను, టీహబ్ చేస్తున్న కృషిని సత్య నాదెళ్ల కొనియాడారు.
ఏఐ విలువలపై రాజీపడితే పెనుముప్పు తప్పదు..
వేగంగా విస్తరిస్తోన్న సాంకేతికత విప్లవంలో ప్రైవసీ, సెక్యూరిటీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలని అడిగిన మంత్రి కేటీఆర్ ప్రశ్నకు... ఇంటర్నెట్ సేఫ్టీ, ఏఐ ఎథిక్స్‌లో రాజీపడితే పెనుముప్పు వాటిల్లుతోందని... నియంత్రణ సంస్థలు ఈ అంశాలపై క్రమశిక్షణ పాటించాలని.. ప్రైవేటు ప్లేయర్లైనా, ప్రభుత్వ సంస్థలైనా పౌరుల ప్రైవసీ హక్కును పరిరక్షించాలని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. హెల్త్ కేర్ డేటా తీసుకుంటే పేషెంట్‌కు లబ్ధి జరగాలి కానీ, హాస్పిటల్ నెట్ వర్క్‌కు కాదని ఉదహరించారు. యూజర్ల ప్రైవసీ, సెక్యురిటీ కాపాడటంలో మైక్రోసాఫ్ట్‌లో ప్రొడక్ట్ డెవలప్మెంట్ కన్నా ముందే... డిజైన్ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటామని సత్య నాదెళ్ల వివరించారు.
ఇదీ చూడండి: రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత