లాక్‌డౌన్ సడలింపులతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున... విద్యుత్ పంపిణీ సంస్థలు మీటర్ రీడింగ్ ప్రక్రియ ప్రారంభించాయి. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమలుతో... విద్యుత్ వినియోగానికి సంబంధించి మీటర్ల రీడింగ్ నమోదు, బిల్లుల జారీలు ఆగిపోయాయి. దీంతో గతేడాది ఏప్రిల్, మే నెలల బిల్లులనే చెల్లించాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. కొంత మంది వినియోగదారులు ఆయా బిల్లులను చెల్లించగా... మరికొందరు చెల్లించలేదు. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రస్తుతం ఈ మూడు నెలల బిల్లులు ఒకేసారి తీసి... వాటిని 3తో భాగించి ఏ నెల బిల్లును ఆ నెలకు అందజేస్తున్నారు. ఇందుకు తగిన విధంగా మీటర్ రీడింగ్ తీసే యంత్రాల్లోని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. దీంతో స్లాబులు మారడం... బిల్లులు ఎక్కువ వచ్చాయనే సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.
సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు
కరోనా దృష్ట్యా మీటర్ రీడింగ్ చేసే సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్‌లు ధరించి రీడింగ్ నమోదు చేస్తున్నారు. వినియోగదారులకు సైతం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా... విద్యుత్ ఆదాయంపై కరోనా ప్రభావం పడిందని అధికారులు చెబుతున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో మార్చిలో 63లక్షల గృహ బిల్లులు ఇస్తే... అందులో 42 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించారు. ఏప్రిల్‌లో 25లక్షల మంది వినియోగదారులు, మే నెల రెండో వారం వరకు 14 లక్షల 80వేల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించండి: గవర్నర్ తమిళిసై