హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డు తరలింపు అంశంపై జరిగిన కీలక సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి-1 కార్యదర్శి యండ్రపల్లి వెంకటేశం అధ్యక్షతన సమావేశం జరిగింది.
కమీషన్ ఏజెంట్ల సంఘాలు, రైతులు, హమాలీ సంఘాల నేతలు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ వీరమళ్ల రామనర్సింహగౌడ్ గౌర్హాజరు కావడంపై వర్తకులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇద్దరు పాలకవర్గ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
గడ్డి అన్నారం నుంచి రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొహెడకు పండ్ల మార్కెట్ తరలింపు.. జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు. ఈ ఏడాది మామిడి సీజన్ దృష్టిలో పెట్టుకుని మే మొదటి వారంలో కొహెడలో తాత్కాలిక మార్కెట్‌ను ఏర్పాటుచేసింది మార్కెటింగ్ శాఖ. నాలుగైదు రోజులపాటు క్రయ, విక్రయాలు చేపట్టింది. అధికారికంగా ప్రారంభోత్సవానికి ముందు రోజు భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా మార్కెట్ యార్డులో తాత్కాలిక షెడ్లు అన్నీ కూలిపోయాయి.
మామిడి విక్రయాలకు ఆటంకం కలగకుండా తక్షణమే గడ్డి అన్నారం, ఉప్పల్‌కు మార్చి కొనుగోళ్లు చేపట్టారు. జులై 15 నుంచి యాపిల్ సీజన్ ప్రారంభం కానుండడం.. హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి కారణంగా మళ్లీ తరలింపు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికే కొహెడలో షెడ్ల పునరుద్ధరణ పనుల్లో మార్కెటింగ్ శాఖ నిమగ్నమైంది. దాదాపు పనులు పూర్తికావచ్చాయి.
ఇప్పటికిప్పుడు కొహెడకు మార్కెట్‌ను తరలించవద్దని.. శాశ్వత నిర్మాణాలు చేపట్టాకే చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు. వినతులను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. మరోసారి పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేసి తుదినిర్ణయం తీసుకుంటామని ఏఎంసీ కార్యదర్శి వెంటేశం చెప్పారు.