గత ఏడాదిన్నరగా గాంధీ ఆసుపత్రి కొవిడ్‌కు ప్రత్యేక వైద్యాలయంగా మారిపోయింది. మధ్యలో కొన్నాళ్లు సాధారణ సేవలు అందుబాటులోకి వచ్చినా రెండోదశ ఉద్ధృతితో అది కాస్తా తాత్కాలికమే అయింది. దీంతో ఇక్కడ వైద్యవిద్యను అభ్యసించే విద్యార్థులకు కొవిడ్ సేవల్లో మినహా.. మరే ఇతర వైద్య విభాగాల్లోనూ అనుభవపూర్వక శిక్షణ పొందే అవకాశం దొరకలేదు. ఈ ఏడాది తుది సంవత్సరం పూర్తి చేసుకున్న ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఉదాహరణకు గాంధీ ఆసుపత్రిలో కార్డియాలజీ విద్యార్థులు గత ఏడాదిన్నరలో క్యాథ్‌ల్యాబ్‌లో శిక్షణే పొందలేకపోయారు. అయినా వారు పరీక్షలు ఉత్తీర్ణులై బయటకు వెళ్లిపోయారు. మరి కార్డియాలజిస్ట్‌గా కనీసం క్యాథ్‌ల్యాబ్‌లో యాంజియోగ్రామ్ చేయడమెలాగో తెలియకుండా.. రోగులకు చికిత్స ఎలా అందిస్తారనేది ఇప్పుడు అంతుపట్టని ప్రశ్న. ఆపరేషన్ చేయాలంటే ఏ రోగానికి ఎక్కడ కొయ్యాలో, ఎలా కొయ్యాలో తెలీకుండానే వైద్యులైపోయిన వీరు రేప్పొద్దున్న నేరుగా రోగుల మీదే ప్రాక్టికల్స్ చేయాల్సిందేనా? రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ కీలకమైన సమస్య ఇది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కలుపుకొని సుమారు 25,000 మంది వైద్యవిద్యార్థులు కొవిడ్ వల్ల నష్టపోతున్నారు.
నాడి పడితేనే వైద్యుడు.. అసలు చేయి పట్టుకోకుండా.. స్టెతస్కోప్‌తో గుండె స్పందనలు, ఊపిరితిత్తుల పనితీరు వంటివేవీ తెలుసుకోకుండా వైద్య వృత్తిని కొనసాగించడం అసాధ్యమే. ఇలాంటి అతి ముఖ్యమైన అంశాలను వైద్యవృత్తి తొలినాళ్లలోనే నేర్పిస్తారు. వైద్యవిద్య అంటే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. కానీ అసలు రోగులను కలవకపోతే ఏమిటి పరిస్థితి? కొవిడ్ దెబ్బకు వైద్యవిద్యలో గతంలో ఎన్నడూ చూడని విపరీత పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యవిద్యార్థులు నాడి పట్టని దుస్థితి నెలకొంది. రోగిని ప్రత్యక్షంగా పరీక్షించి, కష్టాన్ని తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. గత ఏడాది మార్చిలో కొవిడ్ ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశించిందో.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ (మధ్యలో మూడునెలలు తప్ప) క్లినికల్, ప్రాక్టికల్స్‌లో అనుభవపూర్వక శిక్షణ కొరవడింది. అన్ని సంవత్సరాల వైద్యవిద్యార్థులూ ఇదే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేవలం ఆన్‌లైన్ తరగతులకే పరిమితమవుతున్నారు. గతేడాది తుది ఏడాది వైద్యవిద్యార్థులు కూడా ఎటువంటి అనుభవపూర్వక శిక్షణ పొందకుండానే ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. కేవలం పుస్తక పరిజ్ఞానంతో బయటకు వచ్చిన వీరు రోగులకు ఏపాటి వైద్యం అందించగలరనేది ప్రశ్నార్థకం. మాల్స్, బార్లూ.. తెరవడానికి లేని అభ్యంతరం.. వైద్యకళాశాలలకు ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. వైద్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోగలిగిన వైద్యవిద్యార్థుల్ని మాత్రం ఇళ్లకే పరిమితం చేసి ఆన్‌లైన్‌లో నేర్చుకోమనడం విస్మయం కలిగిస్తోందంటున్నారు.
పునాదే దెబ్బతింటోంది
వైద్యవిద్యార్థి రోజువారీ సమయంలో దాదాపు 60 శాతం రోగులతో గడపాలి. వారితో మాట్లాడి, పరీక్షించి, జబ్బు ఎలా వచ్చిందో ఆరా తీస్తారు. ఈ క్రమంలో రోగంతో పాటు రోగి మానసిక స్థితిని పరిశీలించడానికి అవకాశాలుంటాయి. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులు అవయవాల నిర్మాణం గురించి తెలుసుకుంటారు. బయోకెమిస్ట్రీలో నిర్ధారణ పరీక్షల గురించి చెబుతారు. అనాటమీలో మృతదేహాన్ని కోసి పరీక్షించాలి. ఏ అవయవం ఎక్కడుంది? వాటి దగ్గర ఎలా కోత పెట్టాలి? వాటి పనితీరు ఎలా ఉంటుంది? తదితర అంశాలను అనాటమీలో బోధిస్తారు. ఇప్పుడు ఈ శిక్షణ కొరవడడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. నేరుగా తరగతులకు హాజరు కాలేని పరిస్థితుల్లో పునాదే దెబ్బతింటోంది.
దగ్గరగా చూసి నేర్చుకునేదే ఎక్కువ
మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించగానే.. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి తుది సంవత్సరం వరకూ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితర సబ్జెక్టుల్లో అనుభవపూర్వక శిక్షణకు వెళ్లాలి. రోగితో ప్రత్యక్షంగా మాట్లాడాలి. ఈ క్రమంలో వారి రోగ లక్షణాలు పరీక్షిస్తారు. కారణాలు కనుగొంటారు. రోగ చరిత్రను తెలుసుకుంటారు. రోగ లక్షణాలను విశ్లేషించి, నిర్ధారణకు రావడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్స్‌లో పాల్గొంటారు. శవ పరీక్షలను నేర్చుకుంటారు. అవయవాలు ఎక్కడెక్కడ ఉంటాయో.. అవసరమైతే ఎలాంటి జాగ్రత్తలతో శరీరాన్ని కోయాలో తెలుసుకుంటారు. తుది సంవత్సరంలో సాధారణ సర్జరీలన్నీ నేర్పిస్తారు. చెవిలో పురుగు పడితే ఎలా తీయాలి? గొంతులో ఏదైనా అడ్డుపడితే బయటకు తీయడమెలా? ఇటువంటి ప్రాథమిక అంశాల గురించి చెబుతారు. కరోనా సమయంలో ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశాల్లేకుండా పోయాయి. అన్నీ దృశ్యమాధ్యమంలో బోధిస్తున్నారు. ప్రత్యక్షంగా బోధించే దానికి.. పరోక్షంగా దృశ్య మాధ్యమంలో బోధించే దానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు నాలుగో సంవత్సరం విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. ఏమాత్రం అనుభవపూర్వక శిక్షణ లేకుండానే తుది సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నారు. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తే నేరుగా ఇంటర్న్‌షిప్‌లోకి అడుగుపెడతారు. కర్ణాటకలో ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తూనే.. కొవిడ్ పరీక్షలు చేసి రోగుల్నే తరగతులకు రప్పిస్తున్నారు. దీనివల్ల కొంత మేరకైనా అనుభవం లభిస్తోందని అక్కడి వైద్యవిద్యార్థి ఒకరు చెప్పారు.
స్పెషలిస్టులకూ అనుభవ శూన్యమే
పీజీ విద్యార్థులకు కూడా అనుభవపూర్వక శిక్షణ కొరవడింది. వీరు తమ స్పెషలిస్టు వైద్యాన్ని పనిచేస్తూ నేర్చుకోవాల్సిందే. అయితే కొవిడ్ కారణంగా రోగులు ఆసుపత్రులకు రాని పరిస్థితుల్లో.. అసలు వారి విభాగాలే పనిచేయని స్థితిలో.. ఈ స్పెషలిస్టు వైద్యవిద్యార్థులు ఎవరిని చూడాలి? ఏవిధంగా నేర్చుకోవాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదాహరణకు డెర్మటాలజీ విద్యార్థులు.. రోగులే రానప్పుడు వారు ఎవరికి చికిత్స ఇస్తూ నేర్చుకోవాలి? అలాగే జనరల్ సర్జరీ వారికి అసలు ఆపరేషన్లు చేసే అవకాశాల్లేవు. ఇలాంటప్పుడు వీరికి శిక్షణ ఎలా వస్తుంది? ఇవేవీ నేర్చుకోకుండానే పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిస్తే.. దాని ఫలితాలు ఎలాగుంటాయి? వీరంతా ఇలాగే డాక్టర్లయి సమాజంలోకి అడుగుపెడితే పరిస్థితి ఏమిటి అనేదే అసలైన ఆందోళన.
ఇతర ఆసుపత్రులకైనా పంపించాలి
కొవిడ్ కారణంగా పీజీ విద్యార్థులకు అనుభవపూర్వక శిక్షణ లేకపోవడం తీవ్ర నష్టమే. గాంధీలో పీజీలు, హౌజ్‌సర్జన్లు కేవలం కొవిడ్ రోగులను మినహా మరే ఇతర రోగులనూ చూసే పరిస్థితులు లేవు. మొదటిదశ, రెండోదశ అయిపోయాయి. ఇప్పుడు మూడోదశ వస్తుందంటే.. ఇక వైద్యవిద్య కొనసాగేది ఎలా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ కొవిడ్ ఆసుపత్రిగా గాంధీని కొనసాగించాల్సి వస్తే.. ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకైనా అనుభవపూర్వక శిక్షణకు విద్యార్థులను పంపించాలి. -డాక్టర్ హరీశ్ పుంటికూర, కార్డియాలజీ రెసిడెంట్, గాంధీ వైద్యకళాశాల
ఆన్‌లైన్ పాఠాలు అంత ప్రభావం చూపవు
మూడో సంవత్సరం వైద్యవిద్య మొత్తం కొవిడ్ నిబంధనల్లోనే గడిచిపోయింది. రోగిని పరీక్షించడానికి అవకాశాల్లేవు. నేరుగా తరగతి గదిలో పాఠాలు వినడానికి, ఆన్‌లైన్‌లో పాఠాలు వినడానికి చాలా వ్యత్యాసముంది. ఆన్‌లైన్ పాఠాల్లో అంత బాగా దృష్టిపెట్టడానికి అవకాశాలు ఉండవు. పైగా ఆన్‌లైన్ తరగతులు రెగ్యులర్‌గా జరగవు. దృశ్యమాధ్యమంలో పాఠాలు కొందరికి అర్థమవుతాయి. మరికొందరికి అర్థం కావు. అలాంటివారి పరిస్థితి ఏమిటి? కమ్యూనిటీ మెడిసిన్‌లో భాగంగా సమాజంలోకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయుల్లోకి వెళ్లి శిక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవేవీ లేకుండానే నేరుగా తుది సంవత్సరంలోకి అడుగుపెట్టాల్సి వస్తోంది.
-కొర్రా కోటేశ్ నాయక్, ఉస్మానియా వైద్యవిద్యార్థి మూడో సంవత్సరం
విదేశాల్లోనూ ఆన్‌లైన్‌లోనే
గత ఏడాది నుంచి భారత్‌లోనే ఉంటున్నా. ఆన్‌లైన్‌లోనే తరగతులు అవుతున్నాయి. కొవిడ్ తగ్గుముఖం పట్టాకే ప్రాక్టికల్స్ పెడతామని చెబుతున్నారు. కేవలం తుది సంవత్సరం పూర్తయిన విద్యార్థులు మాత్రమే అక్కడ ఉన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంటర్న్‌షిప్ శిక్షణ ఇస్తున్నారు. -కె.రమ్యశ్రీ, ఫిలిఫ్పైన్స్‌లో మూడో సంవత్సరం వైద్యవిద్యార్థిని
సాధ్యమైనంత త్వరగా కళాశాలల ప్రారంభం
అన్ని రాష్ట్రాలూ అన్ని దేశాల సమస్య ఇది. కొవిడ్ వల్ల కొంత నష్టం జరుగుతున్నది నిజమే. అయితే కొవిడ్ తగ్గాక ప్రాక్టికల్ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం. ఒకవేళ మళ్లీ పెరిగితే.. అప్పుడు ఆన్‌లైన్ బోధన ఎలాగూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా కళాశాలలను తిరిగి ప్రారంభించడంపై దృష్టిపెట్టాం. తరగతులు మొదలుపెట్టగానే.. ప్రాక్టికల్స్‌కు, క్లినికల్ శిక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. విద్యార్థులు కూడా లభ్యమైన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాధ్యమైనన్ని ఎక్కువ రోజుల్లో అనుభవపూర్వక శిక్షణకు హాజరవ్వాలి. ఇప్పటికే చాలామంది వైద్యవిద్యార్థులకు టీకాలను అందించాం. కాబట్టి కొవిడ్ వ్యాప్తిపై అంతగా ఆందోళన అక్కర్లేదు. -డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఉపకులపతి, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
ఇలాగైతే సమాజానికీ నష్టమే
వైద్యవిద్యలో రోగి వద్దకెళ్లి నేర్చుకోవడం చాలా ముఖ్యం. విద్యార్థులు కొద్దికాలం వేచిచూసి అయినా అనుభవపూర్వక శిక్షణ తీసుకోవడం అవసరం. అలాకాకుండా వీటిని పూర్తి చేయకుండా పరీక్షల్లో పాసైతే ఆ వైద్యవిద్య అభ్యసన అసంపూర్తే. బోధనాసుపత్రుల్లో శిక్షణ సమయంలో లభించే అనుభవం తర్వాతి కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు. అనుభవపూర్వక శిక్షణ లేకుండా బయటకు రావడం వల్ల వైద్యవిద్యార్థికే కాదు.. రోగులకు, సమాజానికి కూడా నష్టమే. రెండోదశ తర్వాత వెసులుబాటు లభించగానే ప్రాక్టికల్ తరగతులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. ఒకవేళ మూడోదశ ఉద్ధృతి వస్తే.. అప్పుడు మళ్లీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చు.- -డాక్టర్ నరేంద్రనాథ్ నిమ్స్ మాజీ సంచాలకులు
ఇవీ చూడండి: రోబో టైమ్- వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు