త్వరలో రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడనుండగా... ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఆయా కోర్సుల్లో రుసుముల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కళాశాల నిర్వహణ వ్యయం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేతనాలు.. తదితర సమాచారంతో కూడిన నివేదికలను ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు వైద్యకళాశాలలు.. ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)కి అందజేశాయి. ఖర్చులు భారీగా పెరిగినందున ప్రస్తుతమున్న యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్ల రుసుంలను పెంచుతూ ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సిందిగా కోరాయి.
ప్రైవేటు వైద్యకళాశాలలిచ్చిన నివేదికలను ఏఎఫ్‌ఆర్‌సీ పరిశీలించింది. ఉన్నతస్థాయిలో సమావేశం నిర్వహించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. సమావేశ నిర్వహణకు ఇప్పటికే రెండుసార్లు ఏర్పాట్లు చేసినా.. పలు కారణాల దృష్ట్యా ఆ సమావేశాలు ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ప్రవేశాల గడువు సమీపిస్తున్నందున మరోసారి రుసుముల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతమున్న బీ కేటగిరీ రుసుమును సవరిస్తూ కనీసం ఏడాదికి రూ. 14 లక్షలుగా స్థిరీకరించాలని కోరుతున్నట్లుగా తెలిసింది.
ఏఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి చేసే సిఫార్సులపైనే రుసుంల పెంపు అంశం ఆధారపడి ఉంటుందని వైద్యవర్గాలు తెలిపాయి. మరోవైపు కరోనా నేపథ్యంలో వ్యాపార వాణిజ్య లావాదేవీలు దెబ్బతినడం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నామనీ, అందుకే ఈసారి రుసుమలను పెంచవద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంకోవైపు ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇక్కడి కంటే తక్కువ రుసుములున్న కళాశాలల వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు దృష్టిసారిస్తున్నారు.
ఇదీ చదవండిః మీ తప్పు లేదని నిరూపించుకోండి: హరీశ్‌రావు