రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య, దంత, నర్సింగ్, పారామెడికల్ కళాశాలల(Medical College)ను వచ్చే నెల 1 నుంచి తిరిగి ప్రారంభించడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. రెండోదశ కొవిడ్ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది మే నుంచి ప్రాక్టికల్స్, క్లినికల్ శిక్షణ తరగతులు నిలిచిపోయాయి. గత 3 వారాలుగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో.. రాష్ట్రంలో తిరిగి వైద్య విద్యార్థులకు నేరుగా శిక్షణ తరగతులను నిర్వహించాలని కాళోజీ వర్సిటీ భావిస్తోంది. ముందుగా తుది ఏడాది విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తారు. ఈ విద్యార్థులు క్లినికల్, ప్రాక్టికల్ శిక్షణ పొందడం తప్పనిసరి కావడంతో వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి. కళాశాలల ప్రారంభానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి రాసినట్లు వివరించాయి.
అనుభవపూర్వక శిక్షణ
వైద్యవిద్య తుది ఏడాదిలో కచ్చితంగా అనుభవపూర్వక శిక్షణ పొందాలి. ఆసుపత్రుల్లో రోగులతో మాట్లాడటం, చికిత్స పద్ధతుల్ని తెలుసుకోవడం వంటివి కీలకం. కొవిడ్ తొలివిడత ఉద్ధృతి కారణంగా దాదాపు 9 నెలల పాటు అనుభవపూర్వక శిక్షణకు విద్యార్థులు దూరమయ్యారు. మళ్లీ రెండోవిడత విజృంభించడంతో మరో 3 నెలల సమయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. త్వరలో మూడోదశ ఉధ్ధృతి మొదలుకావచ్చన్న అంచనాలు కలవరపరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహమ్మారి తగ్గుముఖం పట్టిన సమయంలోనే వారితో కీలకమైన ప్రాక్టికల్స్, క్లినికల్ శిక్షణ పూర్తిచేయించాలని కాళోజీ వర్సిటీ నిర్ణయించింది. తుది విడతలో ఈ శిక్షణ పొందితేనే పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఇంటర్న్‌షిప్‌కు అర్హత సాధిస్తారు. అందుకే ముందుగా చివరి ఏడాది విద్యార్థులకు తరగతులను నిర్వహించాక దశలవారీగా అవకాశాన్నిబట్టి మిగతా సంవత్సరాల విద్యార్థుల శిక్షణకు ఏర్పాట్లు చేస్తామని కాళోజీ విశ్వవిద్యాలయవర్గాలు తెలిపాయి.
విడతలవారీగా నిర్వహణ
ఉన్న కొద్ది సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా వర్సిటీ ప్రణాళిక రూపొందించింది. సాధ్యమైనంత ఎక్కువమంది ప్రాక్టికల్స్‌కు హాజరయ్యేలా చూడాలని భావిస్తోంది. విద్యార్థులు ఒకేసారి ఎక్కువమంది రాకుండా సగంమందికి ఉదయం, మిగతావారికి మధ్యాహ్నం చొప్పున విభజించి శిక్షణ ఇప్పిస్తారు. థియరీ తరగతులు మాత్రం మరికొంత కాలంపాటు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. విద్యార్థులు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష చేయించుకొని, కొవిడ్ నెగిటివ్ వస్తేనే కళాశాలకు రావాల్సి ఉంటుంది.
- ఇదీ చదవండి : ఆ ఇంటి కరెంట్ బిల్లు రూ. 829 బిలియన్లు!