Delay in Govt Employees Salary : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం నాటికి కూడా ఎనిమిది జిల్లాల్లో వేతనాలు అందలేదు. జీతాలు చెల్లించిన జిల్లాల్లో కూడా కొన్ని శాఖల ఉద్యోగులకు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు నెలకు సుమారు రూ.3,500 కోట్లు అవసరం కానుండగా ఇప్పటివరకు రూ.2,500 కోట్లు విడుదల చేసి శాఖల వారీగా సర్దుబాటు చేసినట్లు తెలిసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.1500 కోట్ల మేర పింఛను చెల్లింపులను సోమవారం నాటికి పూర్తిచేసినట్లు సమాచారం.
శనివారం నాటికి 22 జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు అందగా మిగిలిన పది జిల్లాల్లో సోమవారం ఇచ్చినట్లు ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఇదే పంథా ఈ సారి కూడా కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర రాబడులు సహా బాండ్ల విక్రయం ద్వారా రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో వేతనాల చెల్లింపుల్లో జాప్యం అనివార్యంగా మారిందని ఓ అధికారి చెప్పారు. అందుబాటులోకి వచ్చిన మేరకు నిధులు సర్దుబాటు చేస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా 20వ తేదీ వరకు వేతనాలు అందుతూనే ఉన్నాయని.. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నట్లు కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. వేతనాలు ఎప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయా? అని వేలమంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఉద్యోగ సంఘ నేత ఒకరు చెప్పారు.
పరిస్థితి ఇది.. మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి, పెద్దపల్లి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లో వేతనాలు ఇంకా అందలేదు.
మెదక్, వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో వివిధ శాఖల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో రవాణా, రెవెన్యూ, అటవీ విద్య, ఎక్సైజ్ సహా వివిధ శాఖల ఉద్యోగుల ఖాతాల్లో వేతనం పడలేదు.