mango farmers problems: మామిడి పండించే రైతుకు ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా తయారయ్యాయి. సమయానికి పూత రాకపోవడంతో పాటు తామరపురుగు ప్రభావమూ కన్పిస్తోంది. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణ దిగుబడిలో 20 నుంచి 30 శాతం మేర మాత్రమే వచ్చే పరిస్థితులున్నాయి. దీంతో పెట్టుబడి కూడా చేతికొచ్చేట్లు లేదని రైతులు వాపోతున్నారు.
ఏపీలోని కృష్ణా జిల్లాలో కొద్ది రోజులుగా బంగినపల్లి రకం మామిడి కోతలు మొదలయ్యాయి. దిగుబడులు పడిపోయిన నేపథ్యంలో ధరలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 8.41 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. సాధారణంగా డిసెంబరు, జనవరి నాటికి చెట్లు పూతలతో కళకళలాడుతుంటాయి. అయితే గత అక్టోబరు, నవంబరులో కురిసిన భారీ వర్షాలకు.. తేమ అధికమైంది. పొడి వాతావరణం లేకపోవడంతో పూత ఏర్పడలేదు. జనవరి వచ్చినా.. కొన్ని తోటల్లో పూత 20 నుంచి 30 శాతమే ఏర్పడింది. దీని కోసం మందుల్ని పిచికారి చేశారు. ఫలితంగా పెట్టుబడి పెరిగింది. అంతలోనే మంచు అధికం కావడంతో పూత రాలిపోయింది. పిందె సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడమూ నష్టానికి కారణమైంది. ప్రస్తుతం చాలా తోటల్లో పూత, పిందె, కాయలున్నాయి.
‘నవంబరులో రావాల్సిన పూత జనవరిలో వచ్చింది. అదీ మంచు కారణంగా నిలవలేదు. దీంతో ఎకరాకు టన్ను రావడం కూడా కష్టంగా ఉంది’ అని విజయనగరం జిల్లా మెరకముడిదం మండలం గరుగుబిల్లె రైతు తిరుపతిరావు అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మామిడికి తామరపురుగు ఆశించింది. పూత నిలవనీయలేదు. దీంతో దిగుబడులు క్షీణించాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. పూతతోపాటు పిందెపైనా తీవ్ర ప్రభావం పడింది. విజయనగరం జిల్లాలో సువర్ణరేఖ, పణుకుల రకాల కోత ఇప్పటికే మొదలు కావాల్సి ఉంది. సువర్ణరేఖను ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఏడాది అధికశాతం తోటల్లో కాపు తగ్గిపోయింది. చిత్తూరు జిల్లాలోనూ మామిడి పూత సమయానికి రాలేదు. ఒక చెట్టుకే పెద్ద కాయలతోపాటు పూతలు, పిందెలు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. దిగుబడులు కూడా 25 నుంచి 30% శాతానికే పరిమితం అవుతాయని రైతులు వివరిస్తున్నారు.
ఇదీ చదవండి: మామిడి పండ్లు కిలో రూ.2.70లక్షలు- సెక్యూరిటీ కోసం 15 సూపర్ డాగ్స్!