YS Viveka Murder Case Updates : మాజీ మంత్రి వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం ప్రారంభించింది కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకా ఇంట్లో పనిమనిషిగా చేసిన రాగిరి లక్ష్మీదేవీ సీబీఐకి వెల్లడించారు. మృతదేహానికి బ్యాండేజీలు, కట్లు వేయాలని వారు చర్చించుకున్నారని తెలిపారు. వివేకా బెడ్‌రూమ్‌లోని రక్తపు మడుగు, మరకల్ని శుభ్రం చేయాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనను ఆదేశించారని పేర్కొన్నారు. వాటిని శుభ్రం చేయలేక తనకు వాంతులు వచ్చాయని తెలిపారు. శుభ్రపరచటం తన వల్లకాదంటూ ఎర్ర గంగిరెడ్డితో చెప్పి బెడ్‌రూమ్‌నుంచి హాలు మీదుగా వంటగదిలోకి వచ్చేశానని వివరించారు. ఆ సమయంలో అవినాష్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి బెడ్‌రూమ్‌లోకి రావటం తాను చూశానని పేర్కొన్నారు. తాను రక్తపు మరకలు శుభ్రం చేస్తున్నప్పుడు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, గంగిరెడ్డి, ఇనయతుల్లా, రాజశేఖర్, ఎంవీ కృష్ణారెడ్డితోపాటు మరో 15మంది వివేకా ఇంటి లోపల ఉన్నారని చెప్పారు. 2020 జులై 31న, సెప్టెంబరు 30న, గతేడాది ఆగస్టు 8న ఆమె సీబీఐ అధికారులకు వాంగ్మూలమిచ్చారు. అందులోని వివరాలివీ..
బెడ్‌షీట్‌పైనా రక్తపు మరకలు
YS Viveka Murder Case Latest News : 2019 మార్చి 15వ తేదీ ఉదయం 7.30కు నేను వివేకా ఇంటికి వెళ్లా. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ లేన్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. ఇంటి లోపల గదిలో ఎం.వి.కృష్ణారెడ్డి, ఇనయతుల్లాతోపాటు మరో పదిమంది ఉన్నారు. వంటగదిలో వంట మనిషి ఉన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారనే విషయం ఆమే నాకు చెప్పారు. కొంతసేపయ్యాక ఇనయతుల్లా వచ్చి బెడ్‌రూమ్‌లో రక్తపు మరకలు, మడుగు శుభ్రం చేసేందుకు రమ్మంటున్నారంటూ నన్ను పిలిచారు. ఆయన్ను అనుసరిస్తూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లేసరికి అక్కడ ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డితోపాటు మరో ఇద్దరు, ఇనయతుల్లా ఉన్నారు. చాలాచోట్ల రక్తపు మడుగు, మరకలు కనిపించాయి. వాటిని శుభ్రం చేయాలని గంగిరెడ్డి నన్ను ఆదేశించారు. బెడ్‌షీట్‌పై కూడా రక్తపు మరకలు కనిపించాయి.
హత్యకు 20-25 రోజులు ముందు..
Shocking Twist in YS Viveka Murder : వివేకా ఇంట్లో జిమ్మీ అనే పెంపుడు కుక్క ఉండేది. ఆరేడేళ్లుగా ఆ కుక్క ఆ ఇంట్లో ఉంది. ఇంటి బయట ఉంటూ రోడ్డు పక్కన చెట్ల కింద సేదదీరేది. పగటిపూట ఆ మార్గంలో ఎవరైనా గుర్తుతెలియనివారు వస్తే వారి వాహనాల్ని వెంబడిస్తూ అరిచేది. ఒక రోజు జిమ్మీ చనిపోయి కనిపించింది. వివేకా హత్య సంఘటనకు 20-25 రోజుల ముందు ఇది చోటుచేసుకుంది. జిమ్మీ ఎలా చనిపోయిందో తెలియదు.