చరిత్ర పునరావృతం అవుతోంది. ఎప్పటిలాగే హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఒంటిగంట వరకు ఒక్కశాతం కూడా పోలింగ్ నమోదు అవని డివిజన్లు ఉన్నాయంటే పోలింగ్ పట్ల ఎంత అనాసక్తి ఉందో తెలుస్తోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావటం, కొంత కరోనా భయం... వెరసి పోలింగ్‌పై ప్రభావం చూపింది.
ఈసారైనా.. ప్రజలను ఓటింగ్‌కి రప్పించేందుకు ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీ విస్తృత ప్రచారం చేశాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని తమ వంతు అవగాహన కల్పించారు. అటు ప్రజాప్రతినిధులు సైతం ప్రతీ ఒక్కరు ఓటు వేయాలని మైకులరిగేలా మొత్తుకున్నా... నగరవాసుల బద్దకాన్ని ఏ మాత్రం కదిలించలేవనే చెప్పాలి. కొన్ని చోట్లు ముసలివాళ్లు, వికలాంగులు సైతం పడుతూ లేస్తూ... వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటే... మరికొన్ని చోట్ల మాత్రం మాకేందుకులే అన్నట్లు వారి పని వారు చేసుకుపోయారు.
కొన్ని స్థానాల్లో యువత మెరిసినా... చెప్పుకోదగ్గ ఫలితం మాత్రం కనిపించకపోవటం బాధాకరం. కనీసం ఈసారైనా ఓటింగ్ శాతం 50 దాటుతుందని అందరూ ఆశించినా... నగరవాసుల బద్ధకం వారి ఆశలను మూసిలో కలిపేసింది. ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు కేవలం మూడో వంతు(సుమారు 43 శాతం) నగరవాసులు ఓటేశారంటే ఎంత బాధ్యతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.