ఈనెల 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం కొన్ని సంస్థలు, కార్యాలయాలకు మినహాయింపునిచ్చింది.
ప్రభుత్వ కార్యాలయాలు..
కలెక్టరేట్లు, డివిజనల్, మండల కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. పోలీసు, వైద్యారోగ్య శాఖ కార్యాలయాలతో పాటు పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థల కార్యాలయాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అగ్నిమాపక శాఖ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు మినహాయింపునిచ్చారు.
విద్యుత్, నీటి సరఫరా కార్యాలయాలన్నీ ప్రజలకు సేవలు అందిస్తాయి. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్య్స, మార్కెటింగ్ శాఖల కార్యాలయాలు, పౌర సరఫరాల కార్యాలయాలన్నీ పనిచేస్తాయి. కాలుష్య నియంత్రణ మండలి, తూనికలు- కొలతలు, ఔషధ నియంత్రణ సంస్థ కార్యాలయాలు తెరిచే ఉంటాయి. ఈ శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేస్తాయి. మిగతా శాఖల పని విధానానికి సంబంధించిన ఉత్తర్వులను విడిగా జారీ చేయనున్నారు.
బ్యాంకులు, ఏటీఎంలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఐటీ, టెలికాం, తపాలా, అంతర్జాల సేవలు అందించే కార్యాలయాలు పనిచేస్తాయి.
నిత్యవసర వస్తువుల దుకాణాలు..
నిత్యావసర వస్తువుల రవాణా, సప్లై చైన్‌కు సంబంధించిన కార్యాలయాలు, సంస్థలు, ఆహార పదార్థాల విక్రయం, సరకులు, పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు.. వాటి రవాణా, నిల్వ సంస్థల దుకాణాలను లాక్ డౌన్ నుంచి మినహాయించారు. రెస్టారెంట్లలో పార్సిల్, హోం డెలివరీకి అవకాశం ఉంటుంది. ఆస్పత్రులు, ఆప్టికల్ దుకాణాలు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఫార్మా- తయారీ, రవాణాకు అనుమతినిచ్చింది. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజెన్సీల గోడౌన్లకు మినహాయింపునిచ్చింది. సెక్యూరిటీ సేవలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
కొవిడ్-19 నివారణకు ఉపయోగపడే ప్రైవేటు సంస్థలు సహా విమానాశ్రయాలు, సంబంధిత సేవలకు కూడా మినహాయింపునిచ్చారు.
ఇవీచూడండి: 27కు చేరిన కరోనా కేసులు.. కట్టడికి కఠిన నిర్ణయాలు