లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి వాహనాలు బయటకు రాకుండా నియంత్రిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీపీ సజ్జనార్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. హైటెక్ సిటీ పరిసరాల్లో బయటకి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. నిత్యావసర వస్తు దుకాణాలు కూడా రాత్రి 7 గంటలకు మూసివేయాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు.
బాహ్యవలయ రహదారి మూసివేత!
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు కలెక్టర్ అమయ్ కుమార్ వెల్లడించారు. అత్యవసర హెల్ఫ్ లైన్, సందేహాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగర శివారుల్లో ఉన్న వాహనాలను పంపించిన తర్వాత అధికారుతో సంప్రదించి బాహ్యవలయ రహదారిని కూడా మూసివేస్తామని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు.
ఇటలీ, స్పెయిన్ పరిస్థితి వద్దు
నగరంలో ఆటోలు, క్యాబ్‌లు బయట తిరగొద్దని, వాహనాలు రెంట్‌కు కూడా ఇవ్వొద్దని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌కు నగరవాసులు సహకరించాలని కోరారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఇటలీ, స్పెయిన్‌ను చూసి మనం పాఠాలు నేర్చుకోవాలన్నారు. బయట తిరిగి కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు ప్రాణాలు పణంగా పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
నగరంలో పలు చోట్ల రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి అకస్మిక తనిఖీలు చేశారు. చార్మినార్ పరిసర ప్రాంతాలు, చెక్‌పోస్టులు పరిశీలించారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారికి వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్... కరోనా కేసులు@471