Locality for Government Jobs : తెలంగాణ స్థానికత నిర్వచనాన్ని రాష్ట్రపతి ఉత్తర్వు(జీవో నం.124-30.08.2018)లోని పేరా నం.7లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ స్థానికత నిబంధనలకు లోబడే పోలీసు నియామక బోర్డు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు 1 నుంచి ఏడో తరగతి వరకు చదివిన పాఠశాలల వివరాలను నమోదు చేశారు.
Locality for Telangana Government Jobs : గ్రూప్-1 పరీక్షకు తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌తోపాటు నిరుద్యోగులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంది. ఆయా కేటగిరీల అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.200 మాత్రమే చెల్లించాలి. రాష్ట్రపతి స్థానికత ఉత్తర్వుల ప్రకారం స్థానికేతరులైన 2,700మంది రూ.120 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలని వారికి ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. స్థానికత విషయమై అపోహలు తొలిగేందుకు జీవో నం.124లో పేరా నం.7 చదవాలని ఆ జీవోను, పేరా కాపీని కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం లోకల్ ఏరియా అంటే..
- జిల్లా పోస్టులకు(జూనియర్ అసిస్టెంట్ కిందిస్థాయి) జిల్లా, జోనల్ పోస్టులకు(సూపరింటెండెంట్) జోనల్, మల్టీజోనల్ పోస్టులకు (సూపరింటెండెంట్ పైస్థాయి) మల్టీజోనల్ లోకల్ ఏరియా అవుతుంది. రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లు ఉన్నాయి. గతంలోని రాష్ట్రస్థాయి పోస్టులు ఇప్పుడు మల్టీజోనల్ కిందకు మారాయి.
- రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు రాష్ట్రంలో ఎక్కడ చదివినా లేదా 4 నుంచి 7 వరకు వరుసగా రాష్ట్రంలోని ఒకే ప్రాంతంలో చదివితే తెలంగాణ స్థానిక అభ్యర్థి అవుతారని రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. 4 నుంచి 7 వరకు ఏ ఒక్కఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా తెలంగాణ స్థానికత అర్హత లభించదని ఆ ఉత్తర్వుల్లో ఉంది. 1 నుంచి మూడో తరగతి వరకు ఇతర రాష్ట్రాల్లో చదివినా అభ్యంతరాలు ఉండవు.
- కొందరు అభ్యర్థులు 4-7 తరగతుల్లో ఏదో ఒకటి, రెండేళ్లు పొరుగు రాష్ట్రంలో చదివితే.. వీరు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికేతరులు అవుతారు. మరోవైపు తెలంగాణ నుంచి 7 ముంపు మండలాలు ఏపీలో కలిశాయి. ఆ మండలాల చుట్టూ ఉన్న గ్రామాల విద్యార్థులు ముంపు మండలాల పాఠశాలల్లో చదవగా.. వారు తెలంగాణ ఉద్యోగ పోటీ పరీక్షలకు స్థానికేతరులుగా పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరహా అభ్యర్థులు తమ స్థానికత సమస్యను పరిష్కరించాలంటూ మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
- అభ్యర్థి లోకల్ ఏరియా పరిధిలో 4-7 వరకు వరుసగా చదవకుంటే మరో వెసులుబాటు ఉంది. 1-7వ తరగతి వరకు వరుసగా తెలంగాణ లోకల్ ఏరియా పరిధిలో చదివి.. ఒక్కో తరగతి ఒక్కో జిల్లాలో చదివినా అతను స్థానిక అభ్యర్థే అవుతారు. చివరగా ఏడో తరగతి చదివిన జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణనలోకి తీసుకుంటారు.
- అభ్యర్థి తెలంగాణలోని రెండు, మూడు లోకల్ ఏరియాల్లో 1-7 తరగతులు సమానంగా చదివితే, చివరి తరగతులు చదివిన ప్రాంతం అతని లోకల్ ఏరియా అవుతుంది. అంటే.. 2, 3 తరగతులు ఒక జిల్లాలో, 4, 5 తరగతులు ఒక జిల్లాలో, 6, 7 తరగతులు మరో జిల్లాలో చదివితే.. చివరగా చదివిన 6, 7 తరగతుల జిల్లా ‘స్థానిక జిల్లా’ అవుతుంది.
- 1-7 వరకు లేదా 4-7 వరకు తెలంగాణలో చదవకుండా.. 8 నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు తెలంగాణలో చదివినా వారిని రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ స్థానిక అభ్యర్థిగా పరిగణించరు.