Egg Price in telangana : ఓ వైపు చికెన్ ధర మండుతుండగా.. మరోవైపు కోడిగుడ్డు ధర పడిపోయింది. వేసవి ఎండల తీవ్రతకు కోళ్లఫారాల్లో కొన్ని కోళ్లు చనిపోతుండగా, మిగిలినవి త్వరగా బరువు పెరగడం లేదు. మాంసానికి కోళ్లను అమ్మే బ్రాయిలర్ ఫారాలతో పోలిస్తే గుడ్లను విక్రయించే లేయర్ ఫారాల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు.
Low price for eggs in telangana : ప్రతిరోజూ కోడిగుడ్లను ఎంత ధరకు అమ్మాలో జాతీయ కోడిగుడ్ల సమన్వయకమిటీ(నెక్) నిర్ణయిస్తుంది. ఈ కమిటీ నిర్ణయించిన ధరలకు సైతం వ్యాపారులు కొనడం లేదని లేయర్ ఫారాల రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు ఆదివారం వ్యాపారులకు కోళ్లఫారాల రైతు ఒక్కో గుడ్డును రూ.4.40కి అమ్మాలని నెక్ నిర్ణయించింది. కానీ, కొనేవారు లేక సగటున రూ.3.90కి అమ్మాల్సి వచ్చిందని తెలంగాణ లేయర్ కోళ్లఫారాల సమాఖ్య అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు.
రాష్ట్రంలో రోజుకు సగటున 2.50 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. కోటిన్నర వరకే అమ్ముడుపోతున్నాయి. నిత్యం కోటికి పైగా మిగులుతుండటంతో ఇతర రాష్ట్రాల మార్కెట్లే దిక్కుగా మారాయని ఆయన వివరించారు. చిల్లర మార్కెట్‌లో ప్రజలకు వ్యాపారులు ఒక్కోటి రూ.5 నుంచి 6కి అమ్ముతున్నారు. కానీ, కోళ్లఫారాల రైతుకు మాత్రం ధర పెంచడం లేదు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు గతంలో చికెన్, గుడ్ల ఎగుమతులు ఎక్కువగా ఉండేవి. అక్కడే ఫారాలు పెరగడంతో ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలుగు రాష్ట్రాల నుంచి కోడిగుడ్లను పెద్దగా కొనడం లేదు. జాతీయ స్థాయిలో కోళ్లఫారాల అభివృద్ధి మండలి ఏర్పాటు చేసి చికెన్, గుడ్డుకు మద్దతు ధరలు ప్రకటించాలని, ఉత్పత్తి వ్యయాన్ని శాస్త్రీయంగా లెక్కించి వీటిని నిర్ణయించాలని కోళ్లఫారాల రైతులు కోరుతున్నారు.
కోళ్ల ఫారాల రైతుల్ని సీఎం ఆదుకోవాలి : "ఖర్చులు పెరగడం వల్ల లేయర్ ఫారాల్లో గుడ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. ఒక్కో గుడ్డు రూ.4.80 పడుతోంది. మరోవైపు టన్ను దాణాకు రూ.28 వేలకు పైగా వ్యయమవుతోంది. గతంలో రూ.20 వేలలోపు అయ్యేది. మొక్కజొన్న, సోయాచిక్కుడు, పొద్దుతిరుగుడు రైతులే నేరుగా కోళ్లఫారాల రైతులకు పంట అమ్మేలా ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఫారాలకు తక్కువ ధరకు రావడంతో పాటు పంటలు పండించే రైతులకూ గిట్టుబాటు ధర లభిస్తుంది. ప్రాంతాల వారీగా గుడ్లు, చికెన్ విక్రయ ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రోజుకు సగటున 70 వేల గుడ్లు అమ్ముతారు. వీటిని పట్టణమంతా ఒకే ధరకు అమ్మేలా ప్రభుత్వం చూడాలి. కొత్త కోళ్లఫారాలకు రాబోయే అయిదేళ్లపాటు అనుమతి ఇవ్వకూడదు. ఉన్నవాటిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫారాల తరపున విన్నవించాం. విద్యుత్ సరఫరా తదితరాలకు బ్రాయిలర్, లేయర్ ఫారాల రైతులను ఒకేగాటన కట్టకుండా.. వేర్వేరుగా రాయితీ ఇవ్వాలి." - బండ్ల గణేశ్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ కమిటీ సభ్యుడు