వరంగల్ నగరపాలక సంస్ధ ఎన్నికల్లో... కీలకమైన నామినేషన్ల ఘట్టానికి సాయంత్రంతో తెరపడనుంది. వరంగల్ ఎల్బీ కళాశాల, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నామపత్రాలను స్వీకరిస్తున్నారు. మొదటి రోజు-14, రెండో రోజు-150 మంది అభ్యర్ధులు నామపత్రాలను దాఖలు చేశారు. తెరాస, భాజపా, కాంగ్రెస్, వామపక్షాలు, తెలుగుదేశం, ఏఐఎఫ్బీ తో పాటు...స్వతంత్రులూ నామినేషన్లు చేశారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో.... నామినేషన్ల వెల్లువెత్తే అవకాశముంది. ఇక నామినేషన్ ఘట్టం తుది అంకానికి చేరినా... ప్రధాన పార్టీల్లో అభ్యర్ధుల ఎంపిక కొలిక్కి రాలేదు. అధికారపక్షమైన తెరాసలో టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్కో డివిజన్ లో 5 నుంచి 10 మంది పోటీ పడుతున్నారు. తమ అర్హతలు తెలియచేస్తూ.... ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే అనుభవం, అంగబలం, అర్ధబలం చూసి టిక్కెట్ల కేటాయించే పనిలో... గులాబీ నేతలు సమావేశాల్లో నిమగ్నమయ్యారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులతో... హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమావేశమయ్యారు. వరంగల్ మహానగర ఎన్నికల్లో నూటికి నూరు శాతం అన్ని డివిజన్లలో గులాబీ జెండా రెపరెపలాడాలని...సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవాలని నిర్ణయించారు. వరంగల్‌లో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని.... నేతలు సూచించారు. ఇటు వరంగల్ నగర మేయర్ అభ్యర్ధిపై పలు పేర్లు వినిపిస్తుండగా... పార్టీ నేత, రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఇవాళ మధ్యాహ్నానికి తెరాస అభ్యర్ధులపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికీ టిక్కెట్ ఆశిస్తున్నవారంతా.... ఆఖరి నిమిషంలోనైనా అదృష్టం వరించకపోతుందా అనే ఉద్దేశంతో నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ఆదివారం తెరాస నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి.
ఇటు భాజపా నేతలు కూడా అభ్యర్ధుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సర్వే ఆధారంగానే అభ్యర్ధులకు టిక్కెట్లు దక్కుతాయని....రానివారు క్రమశిక్షణతో పార్టీ నిర్ణయించిన అభ్యర్ధుల విజయానికి పనిచేయాలని...శుక్రవారం జరిగిన ఎన్నికల శంఖారావం సభలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. దీంతో ఒక్కో డివిజన్ వారీగా అభ్యర్ధుల ఎంపిక జరుగుతోంది. తమకు కచ్చితంగా టిక్కెట్ వస్తుందనుకున్న ఆశావహులు... పలువురు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు... కాంగ్రెస్ నేతలు కూడా అభ్యర్ధుల ఎంపికలో నిమగ్నమయ్యారు. టిక్కెట్ ఖాయమనుకున్న కొంతమంది ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో....ఆఖరి రోజు నామినేషన్లు వెల్లువెత్తనున్నాయి. సోమవారం అభ్యర్ధుల నామపత్రాల పరిశీలన జరుగుతుంది.