FLOODS IN KONASEEMA గోదారమ్మ వరద ఉద్ధృతి లంక గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎగువ నుంచి ప్రవాహ తీవ్రత కాస్తా తగ్గుముఖం పట్టినా.. కోనసీమ జిల్లా పి.గన్నవరం, మామిడికుదురు, ఐ.పోలవరం, సఖినేటిపల్లి మండలాల్లోని లంక గ్రామాలు వరద గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. అప్పనరామునిలంక, సఖినేటిపల్లిలంక, కొత్తలంక, టేకిశెట్టిపాలెం, రామరాజులంక బాడవ, అప్పనపల్లి, పాసర్లపూడి బాడవ గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మూడు రోజులుగా వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండంలోని ఏనుగుపల్లి లంక, జీ.పెదపూడి లంక, ఎదురుబీడుం కాజ్‌వే, కనకాయలంక కాజ్‌వేలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. శివాయలంక, బూరుగులంక తదితర లంక గ్రామ వాసులు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పనరామునిలంకలో వరద ధాటికి ఇంటి పిట్టగోడ కూలడంతో ఓ బాలిక గాయపడింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావళి నదికి వరద పోటెత్తింది. కొమరాడ మండలంలోని కల్లికోట, దుగ్గి, జియ్యమ్మవలస, బాసంగి గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ మండలాల్లోని పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోకి వరద నీరు చేరింది. ఎడతెరిపి లేని వానకు వాల్తేర్ డివిజన్‌లోని కోరాపుట్- రాయగడ లైన్ ట్రాక్‌పై బండరాయి, చెట్లు పడటంతో.. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కోరాపుట్-విశాఖపట్నం రైలును శిఖర్ పాయి వద్ద షార్ట్ టెర్మినేట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: కాళ్లు, చేతులు కట్టేసి రూ.30 వేలు అపహరణ