Police Training in Telangana : పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమం కావడంతో అధికారులు తదుపరి ఏర్పాట్లపై దృష్టి సారించారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి సుమారు 9 నెలలపాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. వీరందరికీ వసతి, ఇతర సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత కూడా పోలీసు శాఖదే. అయితే, ఇది అధికారులకు సవాలుగా మారింది. ప్రస్తుతం పోలీసు శాఖ వద్ద 10 వేల మందికి సరిపడా వసతి, శిక్షణ సౌకర్యాలు ఉన్నాయి. ప్రస్తుతం 16 వేల మందికిపైగా నియమించనుండటంతో మిగిలిన వారికి సదుపాయాలను కల్పించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
పోలీసు శాఖలో సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణ ఇస్తారు. తరగతి గదుల్లో వివిధ అంశాలను బోధించడంతోపాటు ప్రతిరోజూ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. తుపాకీతో కాల్చడాన్ని నేర్పిస్తారు. ఎంపికైన ఎస్సైలకు హైదరాబాద్‌లోని రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి పోలీసు అకాడమీలో, కానిస్టేబుళ్లకు పాత జిల్లా కేంద్రాల్లోని పోలీసు శిక్షణ కళాశాలల్లో శిక్షణ ఇస్తారు. వారు ఉండటానికి వసతి, భోజన సౌకర్యం కల్పించాలి. 2018లో కూడా 16వేల మందికిపైగా నియామకం చేపట్టగా వసతి, సదుపాయాల కల్పనకు అధికారులు ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఒక విడత 10 వేల మందికి, రెండో విడత మిగిలిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. ఒకేసారి ఎంపికైన అభ్యర్థులు మొదటి, రెండో విడత శిక్షణ కారణంగా విధుల్లో చేరడానికి దాదాపు ఏడాదిన్నర తేడా వచ్చింది. ఇప్పుడూ 16వేలకు పైగా నియామకాలు చేపడుతుండటంతో వీరందరికీ వసతి ఏర్పాటుచేయడం, సదుపాయాలు కల్పించడం, శిక్షణ నిర్వహించడం ఎలా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 2018లో కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని శిక్షణ కళాశాలలను వాడుకోవాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలను లీజుకు తీసుకోవాలని అధికారులు భావించినా సాధ్యంకాలేదు. గతంలో మాదిరిగానే ప్రత్యేక పోలీసు బెటాలియన్ ప్రాంగణాల్లో శిక్షణ ఇచ్చినా అవి సరిపోయే పరిస్థితి లేదు. దీంతో మళ్లీ ఇంజినీరింగ్ కళాశాలల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అందరూ ఒకేసారి విధుల్లో చేరేలా ఒకే విడతలో శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.
- ఇదీ చదవండి : తెలంగాణలో పోలీసు కొలువులకు ఉచిత శిక్షణ