తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులు పార్టీని విడడంతో రాష్ట్రంలో పార్టీ బలహీనంగా మారింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరికొందరు నాయకులు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో... మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
పార్టీని వీడొద్దని బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కూన శ్రీశైలం గౌడ్... భాజపా నాయకులతో కలిసి దిల్లీ వెళ్లారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలకు కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దిల్లీ చేరుకున్న శ్రీశైలం గౌడ్ ఇవాళ కమలం గూటికి చేరనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.
ఇదీ చూడండి: వైఎస్ షర్మిలను కలిసిన తెరాస ఎమ్మెల్యే కుమారుడు