రైతుల పొలాలు పచ్చగా ఉంటే.. కాంగ్రెస్ నేతలు కళ్లెర్రబడుతున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తుమ్మిడిహట్టిలో నాటు పడవ ఎక్కి.. నాటుమాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పినా.. హస్తం పార్టీ నేతల తీరు మారలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు భారీ విజయాన్ని అందించిన హైదరాబాద్ ప్రజల రుణం తీర్చుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో జరిగిన జూబ్లీహిల్స్ తెరాస సభ్యత్వ నమోదు విజయోత్సవ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో పార్టీ సభ్యత్వ నమోదులో జూబ్లీహిల్స్ మొదటి స్థానంలో నిలిచిందని కేటీఆర్ అభినందించారు.
కేసీఆర్‌ను ప్రజలు మరోసారి గెలిపించడం కొందరికి నచ్చడం లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ నేతలు ఒర్వలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తెరాస పటిష్టంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను బాగున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసదే విజయమని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు తామే పోటీ అన్నారు. ప్రస్తుతం మాటలు చెప్పేవారందరికి ప్రజలే బుద్ధిచెప్తారన్నారు.
కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు విస్తృత అభివృద్ధి జరిగిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. కేటీఆర్ మళ్లీ మంత్రి అయితే మిగిలి ఉన్న సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: తుమ్మిడిహట్టికి ఎందుకు.. కాళేశ్వరం వెళ్లండి: కొప్పుల