KRMB Meeting Today : నీటి వాటా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్‌పై చర్చలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఏఐబీపీ ప్రాజెక్టులపై నిర్వహించే సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేసుకోవడంతో బోర్డు సమావేశం ముందుగా నిర్ణయించినట్లుగానే శుక్రవారం జరగనుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించింది. పునర్విభజన తర్వాత 2015 జూన్ 18, 19 తేదీల్లో దిల్లీలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా తాత్కాలిక అవగాహన కుదిరింది. 2017లో జరిగిన సమావేశంలో చిన్ననీటి వనరుల వినియోగం, గోదావరి నుంచి మళ్లించే, ఆవిరయ్యే నీటిని మినహాయించి మిగిలిన నీటిలో ఏపీ 66%, తెలంగాణ 34% వాడుకునేలా అవగాహనకు వచ్చాయి. గత ఏడాది 66:34కు బదులు 50:50 అమలు చేయాలని తెలంగాణ కోరింది. దీనిపై చర్చ జరిగినా పాత పద్ధతినే అమలు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకొంది. సమావేశంలో దీనిపైనా చర్చ జరగనుంది.
విద్యుదుత్పత్తికి నీటి విడుదలపై..
2021-22 నీటి సంవత్సరంలో శ్రీశైలం నుంచి నీటి విడుదలపై ప్రత్యేకించి విద్యుదుత్పత్తి చేసేందుకు విడుదలపై చర్చ జరగనుంది. పోటీపడి విద్యుదుత్పత్తి చేశారని.. తమ ఆదేశాలను ఉల్లంఘించారని ఎజెండాలో బోర్డు పేర్కొంది. తెలంగాణ 218 టీఎంసీల నీటిని వినియోగించుకొని 281 రోజుల్లో 1217 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగా.. ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీలతో 183 రోజుల్లో 1146 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసింది. శ్రీశైలంలో గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం లేనప్పుడూ విద్యుదుత్పత్తి చేశారని, మొత్తం 501 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి వెళ్లాయని.. ఇందులో ఎక్కువ నీటిని ఆదా చేయడానికి అవకాశం ఉండిందని బోర్డు పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.800 కోట్లు, నాగార్జునసాగర్, పులిచింతలకు మరో రూ.30 కోట్లు అవసరమని పేర్కొంటూ ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చింది.
తెలంగాణకు ఆర్డీఎస్‌లో 15.9 టీఎంసీల కేటాయింపు ఉండగా, చాలా కాలంగా ఈ మేరకు రావడం లేదు. దీన్నీ ఎజెండాలో చేర్చి కర్ణాటక, తుంగభద్ర బోర్డు ప్రతినిధులను కూడా ఆహ్వానించింది. గెజిట్ నోటిపికేషన్ ప్రకారం ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్‌మనీ చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు జమ చేయలేదు. బోర్డు నిర్వహణకు విడుదల చేయాల్సిన నిధులూ ఇవ్వలేదు. వీటితో పాటు బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం తదితర అంశాలపైనా సమావేశంలో చర్చ జరగనుంది.
ఇదీ చదవండి : TSPLRB Instuctions: ప్రాథమిక రాతపరీక్షలో 30 శాతం మార్కులొస్తే సరి!