వ్యవసాయ రంగంలో సమూల మార్పులు రావాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఆర్కె గుప్తా ఆకాంక్షించారు. హైదరాబాద్లో జరిగిన 24వ అంతర్జాతీయ హైడ్రో సదస్సుకు గుప్తా గౌరవ అతిథిగా హాజరయ్యారు. హైడ్రాలిక్స్, నీటివనరుల వినియోగం, తీరప్రాంత ఇంజనీరింగ్ నైపుణ్యతపై ఆయన ప్రసంగించారు.
భారతదేశంలో 80 శాతం నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారని.. అదే అమెరికాలో 40 శాతం మాత్రమే ఉపయోగిస్తున్నారని గుప్తా తెలిపారు. మనదేశంలో వరి పంట పండించడం వల్ల ఎక్కువ నీటిని కేటాయించాల్సి వస్తోందన్నారు. మన ప్రభుత్వాలు వరికి ప్రత్యామ్నాయ పంటను సాగుచేసే విధంగా రైతులను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయిల్, సింగపూర్, పశ్చిమ అమెరికా దేశాల్లో నీటి పునర్వినియోగం ఎక్కువగా జరుగుతోందని.. ఆదిశగా మిగతా దేశాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా కరవులు, వరదలు సంభవిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటి వల్ల నగరాల్లో నీటి సరఫరా తగ్గి.. వేసవిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు.. నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలన్నారు.
ఇవీచూడండి: తెలంగాణ సన్న రకం వంగడాలకు దేశమంతా గిరాకీ!