కొత్త ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదిక, వివరాలను అందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ రాష్ట్ర ఫిర్యాదుపై స్పందించిన బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మేరకు ఛైర్మన్ అనుమతితో బోర్డు సభ్యుడు హరికేష్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ లేఖను కూడా జతపరిచారు.
శ్రీశైలం నుంచి అదనంగా మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రతిపాదించిన కొత్త ఎత్తిపోతలపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై తెలంగాణ గతంలో ఫిర్యాదు చేసిందని... దాని ఆధారంగా ఫిబ్రవరి ఐదో తేదీన వివరణ కోరినట్లు వివరించారు.
ఈ నెల 13న మరో లేఖ రాసినప్పటికీ ఏపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా లేదని బోర్డు పేర్కొంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఫిర్యాదుపై అభిప్రాయాలు చెప్పాలని కోరిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు... 203 ఉత్తర్వులో పేర్కొన్న ప్రాజెక్టుల నివేదికలు, వివరాలను అందించాలని తెలిపింది. ప్రాధాన్యకరమైన అంశంగా పరిగణించాలని సూచించింది.