రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు డీపీఆర్ తయారీ అవసరాన్ని మించి చేపట్టారని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పేర్కొంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీలోని కర్నూలు జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టు పనులను.. ఇటీవల పరిశీలించిన బోర్డు బృందం ఈ మేరకు నివేదిక సిద్ధం చేసింది.
కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, సభ్యుడు మౌతాంగ్, కేంద్ర జలసంఘం సంచాలకులు దర్పన్ తల్వార్‌తో కూడిన బృందం ఈ నెల 11వ తేదీన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించింది. ప్రాజెక్టు పనుల వివరాలను బృందం ఛాయాచిత్రాలతో సహా నివేదికలో పొందుపరిచింది. అప్రోచ్ ఛానల్, ఫోర్‌బే, పంప్‌హౌస్, డెలివరీ మెయిన్, లింక్ కెనాల్, బ్యాచింగ్ ప్లాంట్, నిర్మాణ సామగ్రి తదితరాల వివరాలు అందులో ఉన్నాయి.
తాము పర్యటించిన సమయంలో అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదన్న కేఆర్ఎంబీ బృందం.. సైట్లో రెండు బ్యాచింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని తెలిపింది. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఇతరత్రాలను అక్కడ నిల్వ చేశారని వివరించింది. కేంద్ర జలశక్తి శాఖ మార్గదర్శకాలను పరిశీలిస్తే ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి అవసరమైన వాటికి మించి అక్కడ పనులు జరుగుతున్నాయని కృష్ణా బోర్డు బృందం అభిప్రాయపడింది. ఈ నివేదికను జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు.. కేఆర్ఎంబీ సమర్పించనుంది. దాని ఆధారంగా ఈనెల 16న ఉల్లంఘన పిటిషన్‌పై ఎన్జీటీ విచారణ జరపనుంది.
పర్యటనలో ఏపీ ఇంజినీర్లు పాల్గొనడంపై తెలంగాణ అభ్యంతరం..
కాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం రాయలసీమ ఎత్తిపోతల పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు కలిసి పాల్గొన్నందున నిష్పక్షపాత నివేదిక ఎలా సాధ్యమని తెలంగాణ సందేహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు ఈ నెల 12న లేఖ రాశారు.
‘జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో తెలంగాణ చేసిన ఫిర్యాదు మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం.. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై వాస్తవ నివేదిక ఇవ్వాలని ట్రైబ్యునల్ బోర్డును ఆదేశించింది. తీవ్ర జాప్యం తర్వాత ఈ నెల 11న కమిటీ పర్యటించింది. ఫిర్యాదీలుగా వాస్తవ పరిస్థితిని వివరించేందుకు తమ ప్రతినిధిని కూడా కమిటీతో పాటు అనుమతించాలని బోర్డు ఛైర్మన్‌ను వ్యక్తిగతంగా కోరినా తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తటస్థ కమిటీతో వెళ్లేందుకూ అనుమతించలేదు. కమిటీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, పలువురు చీఫ్ ఇంజినీర్లు పాల్గొని కమిటీతో చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు ఓ పత్రికలో వచ్చింది. ఈ నేపథ్యంలో కమిటీ నిష్పక్షపాతంగా నివేదిక ఇస్తుందా? అన్నదానిపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి’ - రజత్‌కుమార్, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.
సంబంధిత కథనాలు..