కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ( KRMB announcement on Gazette implementation)అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తున్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రకటించింది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది.
వాయిదా వేయాలనే కోరాం..
అయితే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేసేంతవరకు గెజిట్ నోటిఫికేషన్ అమలు ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్టును (KRMB meeting ) కోరినట్లు.. రాష్ట్ర నీరుపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కేఆర్‌ఎంబీ భేటీకి హాజరైన రజత్ కుమార్.. రాష్ట్ర అభ్యంతరాలు తెలిపామన్నారు. కృష్ణా పరిధిలో 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్నాయని.. నాగార్జునసాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని.. తాము అభ్యంతరం చెప్పామని రజత్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా ఆడిగామన్నారు. విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఏపీ అడుగుతోందని.. ఈనెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. త్వరలో కేంద్రానికి, ఏపీకి తమ నిర్ణయాన్ని చెబుతామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ(KRMB) ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీకి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఈనెల 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తున్నట్లు కృష్ణా బోర్డు ప్రకటన విడుదల చేసింది.