తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. భాజపా నేత భూపేంద్రయాదవ్తో భేటీ అయినందున పుకార్లు వచ్చాయని, ఆ భేటీకి ఎలాంటి ప్రత్యేకత లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర కమిటీల్లో సభ్యులుగా తమ మధ్య స్నేహం ఏర్పడిందని, ఆ చొరవతోనే కలిశామని తెలిపారు. తమ మధ్య పార్టీ మార్పునకు సంబంధించి చర్చ రాలేదని వివరించారు.
బీ ఫారాల విషయంలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోందన్న విశ్వేశ్వర్ రెడ్డి.. ఫారాలను నేరుగా ఎన్నికల అధికారులకే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోటీ అధికంగా ఉన్నచోట నలుగురైదుగురు కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేశారని, ఇలాంటి పరిస్థితుల్లో బీ ఫారం అభ్యర్థులకు ఇవ్వడం కొంత ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. అందుకే పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు చెందిన ఫారాలను నేరుగా రిటర్నింగ్ అధికారులకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.