Komati Reddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి.. మీడియా దృష్టిని ఆకర్షించారు. తమ్ముడు రాజీనామా చేసిన నాటి నుంచి తనపై రాష్ట్ర నాయకత్వం చూపుతున్న వివక్షతో అసహనంగా ఉన్నారు. సొంత పార్టీ నేతలే.. తమపై విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయాన్ని తాను ఎంత సీరియస్‌గా తీసుకున్నారనే విషయాన్ని ప్రతీసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన వెంకట్‌రెడ్డి.. బహిరంగ క్షమాపణలు కోరారు. ఆయన కోరినట్టే.. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి క్షమాపణలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తమను హోంగార్డులంటూ చేసిన వ్యాఖ్యలను మాత్రం వెంకట్‌రెడ్డి మనసుకు తీసుకున్నారు. పార్టీలో ఐపీఎస్లున్నారని.. వాళ్లే పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని.. తాము కేవలం హోంగార్డులమేనని.. తమతో ఏమీ కాదంటూ.. వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఇవాళ.. ఏకంగా ఆయన ట్విటర్ ప్రొఫైల్‌లో తాను కాంగ్రెస్ హోంగార్డు అంటూ పేర్కొన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీని.. అని పేర్కొంటూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నానని తన ట్విటర్ ఖాతాలో మార్పులు చేయటం గమనార్హం. తనపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇరువురూ క్షమాపణలు చెప్పినప్పటికీ కోమటిరెడ్డి ట్విటర్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌కు హోంగార్డు అంటూ మార్పులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. తని నిర్ణయాన్ని మార్చుకుని 3 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌కు హోంగార్డును అనే పదాన్ని తొలగించటం గమనార్హం.
మరోవైపు.. భువనగిరిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్‌పై ఫిర్యాదును అధిష్ఠానం చూసుకుంటుందన్న వెంకటరెడ్డి.. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామమన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం వరాలు కురిపిస్తారని.. లేకుంటే ఫామ్‌హౌస్ నుంచి బయటకు రారని విమర్శించారు.
"మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్. నన్ను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారు.. వాళ్లే చూసుకుంటారు. సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఫామ్‌హౌస్, ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తారు. ఆ నియోజకవర్గ అభివృద్దికి వరాలు కురిపిస్తారు. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైలు కోసం రూ.90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే.. రూ.500 కోట్లతో పనులు మెదలుపెడతామని కేంద్రం చెప్పింది. ఇంతరకు రూ.90 కోట్లు కట్టలేదు. దళితబంధు నియోజకవర్గంలోని ఒక గ్రామానికే ఇస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు అన్నారు. రాష్ట్రం మొత్తం ఇవ్వాలి. బీసీలకు, ఎస్టీలకు ఇలాంటి స్కీమ్ పెట్టాలి. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం వరాలు ఇస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే 10లక్షల మందికి పింఛన్లు ఇస్తామంటున్నారు. తొమ్మిదేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టారా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాల్లో మాత్రం 57వేల ఇళ్లు కట్టారు. మునుగోడులో పోడు భూముల సమస్య ఉంది. పరిష్కరించాలని చెప్పినా.. ఇంతవరకు పట్టించుకోలేదు." -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగరి ఎంపీ
ఇవీ చూడండి: