పట్టించుకోని నిర్వహకులు..
భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పందేలు హోరాహోరీ సాగాయి. కోడికి కత్తి లేకుండా పందేలు నిర్వహించాలని సూచించినా... వాటిని పట్టించుకోకుండానే పోటీలు నిర్వహించారు. కాళ్ల , ఆకివీడు, పాలకోడేరు, వీరవాసరం మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో పందేలు సాగాయి.వీటిని చూసేందుకు తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించారు.
లక్షల రూపాయల బెట్టింగులు..
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రులో భారీస్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. పందెంరాయుళ్లు లక్షల రూపాయల్లో బెట్టింగులు సాగాయి. కోడి పందేల నిర్వహణ కోసం భారీస్థాయిలో షామియానాలను, గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు అధికసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో కోడిపందేలు, గుండాట జోరుగా సాగాయి. గుడారాల్లో పేకాట, గుండాట నిర్వహించారు.
కృష్ణా జిల్లాలోనూ కోడిపందేలు జోరుగా సాగాయి. ఘంటసాల మండలం కొడాలిలో ఏర్పాటు చేసిన బరికి... వేలసంఖ్యలో పందెంరాయుళ్లు రావడం వల్ల... అవనిగడ్డ -కూచిపూడి రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చల్లపల్లి మండలం పాగొలు, మోపిదేవి మండలం కోసూరువారిపాలెం, కొక్కిలిగడ్డ, అవనిగడ్డ, కోడూరు , నాగాయలంకలో యథేచ్ఛగా కోడిపందేలను నిర్వహించారు. ఇక్కడ ఒక్క రోజే వందలాది కోళ్లు నేలకొరగ్గా.. లక్షల రూపాయలు చేతులు మారాయి. గుంటూరు జిల్లా నుంచి వచ్చిన పందెంరాయుళ్లు.. కోడిపందేల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి : రాజధాని తరలిస్తున్నామని మేం చెప్పలేదు: హోం మంత్రి