పండ్లు, కూరగాయలు, పూలు, నూనెగింజలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. వివిధ రంగాల తరహాలోనే ఉద్యాన పంటల సాగులోనూ దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూణ్నెళ్లలోగా రాష్ట్ర సమగ్ర ఉద్యాన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలు తీర్చడం సహా ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేలా ఉద్యాన పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించాలని.. అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల్లో ఉద్యానపంటల మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఉద్యానవన పంటల విషయంలోనూ సమగ్ర దృక్పథం ఏర్పరచుకోవాలని ఆకాంక్షించారు.
మనమే ఎగుమతి చేసేలా..
రాష్ట్ర వాతావరణం, రైతుల నైపుణ్యం... తోటల సాగుకు ఎంతో అనుకూలమన్న సీఎం.. సానుకూలతలు ఉండి కూడా ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు, మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి పోయి ఉద్యాన పంటల్లో తెలంగాణ.. స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మన అవసరాలు తీర్చడం సహా వివిధ రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేలా ఎదగాలని.. ఆ దిశగా ఉద్యాన శాఖ సమాయత్తం కావాలని సూచించారు.
గుణాత్మక మార్పే లక్ష్యం..
రైతులను చైతన్య పరిచి, ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యాన పంటలు సాగు చేయగలుగుతామో నిర్ణయించి అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల సాగులో అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గుణాత్మకమైన మార్పు తీసుకురావడమే ధ్యేయంగా సమగ్ర ఉద్యానవన పంటల విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రానికి అనుగుణమైన విధానాన్ని మూడు నెలల్లో రూపొందించాలని, ఏడాదిలోగా ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలని ఆదేశించారు.
అగ్రగామిగా రాష్ట్రం..
ఉద్యానవన పంటల సాగులో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఉద్యాన శాఖ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలన్న సీఎం... ఆ దిశగా విద్య, పరిశోధన, విస్తరణ జరగాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా లాంటి రాష్ట్రాలు, నెదర్లాండ్ లాంటి దేశాలు ఉద్యానవన పంటలు అద్భుతంగా పండిస్తున్నాయన్న కేసీఆర్.. అక్కడకు వెళ్లి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్‌కు పంపి శిక్షణ ఇప్పించాలని సూచించారు. అక్కడి నిపుణులను రాష్ట్రానికి ఆహ్వానించి, ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.
కొంగరకలాన్‌లో ఉద్యాన పంటల మార్కెట్..
ఉద్యానవన పంటల సాగులో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్‌పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని సూచించారు. శిక్షణ, అధ్యయనం నిరంతరాయంగా సాగాలని.. యాంత్రీకరణను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యానవన పంటల సాగుతో పాటు మార్కెటింగ్‌పైనా దృష్టిసారించాలని స్పష్టం చేశారు. అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా పంటలను సాగుచేయించాలని ముఖ్యమంత్రి సూచించారు. దిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ తరహాలో.. హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్‌ను నెలకొల్పుతామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
మండలానికి ఉద్యాన అధికారి..
ఉద్యాన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని... శాఖను విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మండలానికో ఉద్యాన శాఖ అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం... సాగు విధానంలో మార్పులు, మార్కెటింగ్‌పై నిరంతర సమాచారం, పంటల్లో నాణ్యత చర్యలపై అధ్యయనం చేసేందుకు సీనియర్ అధికారుల నాయకత్వంలో ప్రత్యేక విభాగాలు ఉండాలన్నారు. శాఖ విస్తరణ, అవసరమయ్యే ఉద్యోగులకు సంబందించి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న అన్ని రైతు వేదికల్లో ఉద్యానవన శాఖ అధికారులు కూడా కూర్చుని రైతులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇవీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం