కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల పరిహారం చెల్లింపుపై దాఖలైన పిటిషన్లను పునర్ విచారించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాలను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం విచారణ జరిపింది.
భూ నిర్వాసితులు దాఖలు చేసిన పలు పిటిషన్లలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు, పెళ్లికాని మేజర్ అయిన యువతకు పూర్తి పరిహారం, పరిహారం చెల్లింపు ఆలస్యం అంశాల్లో పలువురికి కోర్టు ధిక్కరణ వంటి ఆదేశాలను హైకోర్టు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలను పరిగణలోకి తీసుకోలేదని సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోర్టుకు తెలిపారు.
కరోనా వ్యాప్తి కారణంగా అడ్వకేట్ జనరల్ సమయం ఎక్కువ కోరినట్లు చెబుతున్నారని.. కరోనా సంక్షోభంలోనూ సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలు చేపట్టినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. కేసు విచారణను హైకోర్టు.. హడావుడిగా ముగించడాన్ని ఆమోదించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతున్నామన్న ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు సీజే.. నిర్వాసితుల పిటిషన్లను పునర్విచారించాలని ఆదేశించింది.
హైకోర్టులో ఈ కేసుపై వాయిదాలు కోరవద్దని అడ్వకేట్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది. తాజా సుప్రీం ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టులో పరిహారంపై నిర్వాసితుల కేసు మళ్లీ మొదటి నుంచి హైకోర్టులో విచారణకు రానుంది.