రాష్ట్ర హైకోర్టు సీజేగా జస్టిస్ హిమా కోహ్లి నియామకం అయ్యారు. ఈ నెల14న సుప్రీం కొలీజియం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కోహ్లి పదోన్నతిపై తెలంగాణకు రానున్నారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను.. ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ అయింది.
జస్టిస్ హిమా కోహ్లీ ప్రస్తుతం... దిల్లీ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్నారు. ఈమె పదోన్నతిపై... తెలంగాణ హైకోర్టుకు రానున్నారు. 1959 సెప్టెంబర్ 2న దిల్లీలో జన్మించిన జస్టిస్ కోహ్లీ దిల్లీ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేశారు. 1984లో న్యాయవాదిగా ... 2006లో దిల్లీ అదనపు న్యాయమూర్తిగా... 2007లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు పలు ప్రధానమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఆమె దిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. 2020లో దిల్లీ జ్యూడిషియల్ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాల్లోని జైళ్లలో రద్దీ తగ్గింపు కోసం 2020 మార్చి 23న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు.. దిల్లీ ప్రభుత్వం మార్చి 26న ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి ఛైర్ పర్సన్‌గా జస్టిస్ కోహ్లీ వ్యవహరించారు. న్యాయమూర్తిగా సేవలందిస్తూనే ఆమె మధ్యవర్తిత్వాన్ని... ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా ప్రోత్సహిస్తున్నారు. వాతావరణం, పర్యావరణ, సంరక్షణ, కుటుంబ వివాదాల పరిష్కారంలో కుటుంబ న్యాయస్థానాల పాత్రను ప్రోత్సహించడంలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ అంశాలపై జస్టిస్ హిమా కోహ్లీ.. అనేక జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, సింపోజియంలలో పేపర్లు ప్రజెంట్ చేశారు.
ఏపీ హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కింకు బదిలీ అయ్యారు. సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి ఏపీకి రానున్నారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా హైకోర్టు సీజేలు, జడ్జీలు బదిలీ