ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట యోధుడిగా... పాలకుడిగా దేశానికి ఒక మార్గం చూపుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఒక్కటి, రెండు రంగాల్లో తప్ప అనేక రంగాల్లో రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాసిన ఒక్కగానొక్కడు పుస్తకాన్ని బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లోని వినోద్‌కుమార్ నివాసంలో... మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఆర్థిక రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్రం చెబుతుంటే... రాష్ట్ర నాయకులు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గతంలో పల్లెలు ఎంతో అధ్వాన్నంగా ఉండేవని, ఇప్పుడు ఎక్కడ చూసినా... పచ్చదనంతో ఆహ్లాదంగా మారాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా... అవార్డులు మాత్రం ఇస్తోందన్నారు. ఆర్థిక, సంక్షేమ, గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బాల్క సుమన్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం: కొప్పుల