సీఎం కేసీఆర్ ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు. జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశముందని సీఎం కేసీఆర్ వివరించారు.
ఎక్కడి వాళ్లకు అక్కడే
"నూతన జోనల్ విధానం ప్రకారంగా రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తయిపోతుంది. ఆ తర్వాత.. ఏ జిల్లా వాళ్లకు ఆ జిల్లా కేడర్ పోస్టులు ఇచ్చేస్తాం. ఏ మండలానికి ఎంత మంది సిబ్బంది ఉండాలనేది.. లెక్క ఉంటుంది. దాని ప్రకారం జిల్లాలో ఎంత మంది సిబ్బంది అవసరముంది అనేది తెలుస్తుంది. జోనల్ విధానం అనేది ఈ మధ్యే వచ్చింది. అది ఒక్కసారి ల్యాండ్ అయిపోతే మనకు కూడా ఎంత సంఖ్య ఉందని తెలుస్తుంది. ఆ ప్రక్రియ కూడా 2, 3 నెలల్లో రిక్రూట్మెంట్ చేసేస్తాం. కొంత మంది రేపే చేయాలి. ఎల్లుండే చేయాలని పట్టుపడుతున్నారు. అలా చేసేది కాదు. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది కదా. నిన్న గాక మొన్న కదా మన జోనల్ విధానం వచ్చింది. మనం తీసుకొచ్చుకున్న జోనల్ విధానాన్ని మనమే ధిక్కరించలేం కదా. అందుకే ఈ దసరా పండుగ తర్వాత ఉద్యోగులతో నేను మాట్లాడతా. ఇప్పటికే సీఎస్ మాట్లాడారు. ఒక్కసారి సెట్ అయిపోతే.. ఎక్కడివాళ్లకు అక్కడే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాకు ఆనందంగా సేవ చేసుకుంటారు. నాకున్న అంచనా ప్రకారం.. ఇప్పుడిచ్చిన లక్షా యాభై వేలు కాక.. ఇంకో 70 నుంచి 80 వేల ఉద్యోగాలు వస్తాయి. అవి కూడా సౌకర్యవంతంగా.. ఎక్కడి వాళ్లకు అక్కడే." - సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇవీ చూడండి: