తెలంగాణ వ్యాప్తంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ... మహనీయునికి నివాళులర్పించారు. వరంగల్‌లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహానికి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ఛీప్ విప్ వినయభాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రాభివృద్ధిలో జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పారు. తొర్రూరులోనూ ఏర్పాటుచేసిన జయశంకర్ జయంతి వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం అనుక్షణం పరితపించారు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనుక్షణం పరితపించిన మహోన్నత వ్యక్తి... ఆచార్య జయశంకర్ అని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జయశంకర్ 87వ జయంతి సందర్భంగా.. నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, సిద్దిపేటలో హరీశ్‌రావు... ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు... విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొని ప్రజలను చైతన్యపరిచిన మహానీయుడని కొనియాడారు. ముఖ్యమంత్రి జయశంకర్ స్ఫూర్తితోనే సీఎం ముందుకు వెళ్తున్నారని అన్నారు.
తెరాస ఎంపీలు నివాళులు
ఆచార్య జయశంకర్ కలలుగన్న తెలంగాణను... కేసీఆర్ ఆధ్వర్యంలో నెరవేర్చుంటున్నామని... తెరాస ఎంపీలు పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా... ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎంపీలు తెలిపారు.
తెజస కార్యాలయంలో జయంతి వేడుకలు
నాంపల్లిలోని తెజస కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయశంకర్ అనేక మంది మేధావులను తెలంగాణ ఉద్యమం వైపు తీసుకొచ్చారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం చేయాల్సి వస్తుందని జయశంకర్ చెప్పారని గుర్తు చేశారు.
ఖమ్మంలో
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. తెరాస జిల్లా పార్టీ కార్యాలయంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ నీరజ, కార్పొరేటర్లు జయశంకర్‌కు నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ ఆశయాల సాధనలో తెరాస ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతిని జగిత్యాలలో ఘనంగా నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు.. తెలంగాణ సాధనలో జయశంకర్ చేసిన కృషి మరలేనిదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: KTR: పట్టణీకరణకు పెద్దపీట... మురుగునీటి శుద్ధిపై ప్రత్యేక శ్రద్ధ