జనతా కర్ఫ్యూకు ప్రజా రవాణా వ్యవస్థలు పూర్తి మద్దతు ప్రకటించాయి. రైల్వే, ఆర్టీసీ, మెట్రో సర్వీసులను రద్దు చేస్తున్నామని ఆయా సంస్థల అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 745 రైళ్లు నడుస్తుంటాయి. జనతా కర్ఫ్యూలో భాగంగా కేవలం 50 రైళ్లను మాత్రమే నడుపుతున్నామని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 121 ఎంఎంటీఎస్ రైళ్లకు గాను.. నేడు 12 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయని తెలిపింది.
డిపోలకే బస్సులు..
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇతర రాష్ట్రాల బస్సులను కూడా సరిహద్దుల్లోనే ఆపేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎం ఆదేశానుసారం బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నామని..ఆర్టీసీ ప్రకటించింది. డ్రైవర్లు, కండక్టర్లు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటామని పేర్కొన్నారు. బస్టాండ్లలో ఆహార బాండాగారాలను కూడా సంస్థ మూసివేసింది. కర్ఫ్యూకు ప్రయాణికులు సహకరించాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ మెట్రో...
జనతా కర్ఫ్యూలో భాగంగా మెట్రో రైళ్లను రద్దు చేశామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో - ఎల్అండ్టీ మాల్స్‌ను కూడా జనతా కర్ఫ్యూలో భాగంగా మూసివేశారు. ప్రజలు కేవలం ఇళ్లకే పరిమితం కావాలని మెట్రో ఎండీ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆటోలు, జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 2లక్షల ఆటోలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి.
క్యాబ్ సర్వీసులు..
రాష్ట్రంలో సుమారు లక్షా 65 వేల క్యాబ్‌లున్నాయి. వీటిలో 80వేల పైచిలుకు ఓలా, ఊబర్ క్యాబ్లే. వీటితో పాటు ఐటీ రంగంలో నడిచే క్యాబ్‌లు కూడా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నాయి. కర్ఫ్యూలో తామంతా భాగస్వామ్యమవుతామని ట్యాక్సీ డ్రైవర్స్ జేఏసీ అసోసియేషన్‌లోని 15 సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి.
లారీలు ..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.75 లక్షల లారీలను జనతా కర్ఫ్యూలో భాగంగా నిలిపివేస్తున్నామని...లోడింగ్ అన్ లోడింగ్ ఆపేశామని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. లారీ డ్రైవర్లు, యజమానులు కూడా కర్ఫ్యూలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'