Nadendla Manohar comments on CM Jagan: అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోరాటంలో చివరికి ఆత్మ గౌరవమే గెలుస్తుందని.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. "భీమ్లా నాయక్" సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని విరుచుకుపడ్డారు. థియేటర్ల వద్ద జరిగిన సంఘటనలు చూసి అందరూ ఆశ్చర్యపోయారన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి.. పవన్ కల్యాణ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు.
ఆ సమయం ఆసన్నమైంది
ప్రజాసమస్యలు తీరుస్తారని నమ్మి అధికారమిస్తే.. జగన్ ఇలాంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండబోరని నాదెండ్ల వ్యాఖ్యానించారు. ప్రజలు, రైతు సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ సిబ్బంది.. వేకువ జామునే సినిమా థియేటర్ల దగ్గరకు వెళ్లి హడావుడి చేశారన్నారు. సంకుచిత మనస్తత్వం, నియంతలా వ్యవహరిస్తూ.. తన ఆలోచన మేరకే ప్రతి ఒక్కరు పనిచేయాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ను పక్కన పెట్టే సమయం ఆసన్నమైందని ఆరోపించారు. ఆత్మగౌరవంతో ఉన్న వారంతా వైకాపా నుంచి బయటకు రావాలని కోరారు.
"విద్యార్థులు, రైతులు, సామాన్యులకు ఉపయోగపడేవిధంగా పనిచేయాల్సిన తహసీల్దార్లను.. ఇలా థియేటర్లకు పంపించడం పొరపాటు. సీఎం జగన్ పాలనలో ఇలాంటి పరిపాలన ఉంటుందని ఊహించలేదు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరాటంలో ఆత్మగౌరవమే గెలుస్తుంది. ఆత్మాభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ వైకాపా నుంచి బయటకు రావాలి. పవన్ కల్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపించాలి. రాష్ట్ర ప్రజలందరూ తన ఆలోచన మేరకే పనిచేయాలని భావించి నియంతలాగా పాలించే జగన్‌ను.. పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది." -నాదెండ్ల మనోహర్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్
వారి ఓటమి ఖాయం..
"భీమ్లా నాయక్" సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మింది.. వైకాపా నాయకులేనని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరగొట్టేందుకు పవన్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయకుండా, రాజకీయ ఆరోపణలు చేసే మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: బాక్సాఫీస్‌పై 'భీమ్లానాయక్' దండయాత్ర.. నైజాంలో ఆల్‌టైం రికార్డ్!