వివిధ ప్రాంతాల్లో లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ఉన్నా... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాథపురంలో కొలువైన ఈ క్షేత్రంలో స్వామి భక్త సులభుడనీ... స్వామి వల్లే ఇక్కడ వర్షాలు పడుతున్నాయనీ భక్తుల నమ్మకం. ఇప్పటికీ మాతంగ మహర్షి ఈ ఆలయానికి సర్పం రూపంలో వచ్చి స్వామిని దర్శించుకుంటాడని అంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది మరి.
స్థలపురాణం
ఒకప్పుడు ఈ ప్రాంతం దట్టమైన అడవిలా ఉండేదట. దోపిడీ దొంగల వల్ల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొనేవారట. వ్యవసాయం చేయాలనుకున్నా వర్షాలు సరిగ్గా పడేవి కావట. దాంతో తీవ్ర కరవుతో, రకరకాల వ్యాధులతో ప్రజలు నానా కష్టాలూ అనుభవించేవారు. తమ కష్టాలు పోవాలంటే మహర్షుల వల్లే సాధ్యమవుతుందని నమ్మిన ఈ ప్రజలకు ఇప్పటి రాజమహేంద్రవరం రోడ్డులోని కరిచర్ల గూడంలో తపస్సు చేసుకుంటున్న మాతంగ మహర్షి గురించి తెలిసిందట. దాంతో ఆ మహర్షి దగ్గరకు వెళ్లి తమ బాధలు చెప్పుకోవడంతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడట.
కొన్నాళ్లకు మహర్షి తపస్సుకు మెచ్చి లక్ష్మీనరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. దాంతో మహర్షి స్వామిని ఇక్కడే ఉండి పొమ్మని కోరగా, అది సాధ్యం కాదనీ తన తేజస్సును అక్కడున్న శిలలో నిక్షిప్తం చేశాననీ చెప్పి స్వామి మాయమయ్యాడట.
అప్పటి నుంచీ స్థానికులు ఆ శిలనే స్వామిగా భావించి పూజలు చేయడం ప్రారంభించడంతో వాళ్ల కష్టాలు తీరాయట. అయితే కొంతకాలానికి వీళ్లు పూజలు చేయడం ఆపేశారు. కొన్నాళ్ల తరువాత లక్కవరానికి చెందిన కొచ్చర్లకోట రామారావు అనే భక్తుడు తన ఉద్యోగులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లాడట. అక్కడున్న పశువుల కాపరులు కొండపైన ఏదో ఉందనీ ఎవరైనా గట్టిగా అరిస్తే తిరిగి అంతే గట్టిగా అరుపు వినిపిస్తోందనీ చెప్పడంతో అక్కడికి వెళ్లి పరిశీలించాడట. తీరా చూస్తే రాళ్లు పరిచిన ద్వారం, మొండి గోడలతో ఉన్న ఆలయం కనిపించింది. అందులోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం ఉందట. దాంతో అప్పటి కప్పుడు పూజలు నిర్వహించి పాల పొంగలిని నైవేద్యంగా పెట్టాడట. ఆ వెంటనే ఎవరూ ఊహించని విధంగా కుండపోతగా వర్షం పడింది. అప్పటినుంచీ నిరంతరంగా పూజలు కొనసాగిస్తున్నారనీ, వర్షాభావం సమస్యే ఎదురుకాలేదనీ చెబుతారు స్థానికులు. అంతేకాదు... ఆ రోజునుంచీ ఈ ఆలయంలో పాలపొంగలిని నివేదించే ఆచారం మొదలయ్యింది.
ప్రత్యేకతలు
ఈ ఆలయాన్ని ద్వారకా తిరుమల దత్తత తీసుకుంది. అందుకే ద్వారకా తిరుమల వచ్చిన వారంతా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారని అంటారు. ఈ ప్రాంగణంలో ఏడాది పొడవునా వివిధ సందర్భాల్లో జరిగే పూజలు ఒకెత్తయితే మహాశివరాత్రి రోజున చేసే సుదర్శన హోమం, భీష్మ ఏకాదశినాడు జరిగే కల్యాణమహోత్సవం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడం విశేషం. ఇప్పటికీ మాతంగ మహర్షి ఇక్కడకు సర్పరూపంలో వచ్చి స్వామిని దర్శించుకుంటారని అంటారు. ఇక్కడకు వచ్చే భక్తులు ఏదయినా కోరుకుని ఈ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామికి పానకం సమర్పిస్తారు. తమ కోరిన నెరవేరిన తరువాత పాలపొంగలి నివేదించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. అదేవిధంగా సంతానం లేనివారు ఇక్కడకు వచ్చి ప్రాణాచారం అనే వ్రతాన్ని నిర్వహిస్తారు.
ఎలా చేరుకోవచ్చు
ద్వారకా తిరుమల నుంచి ఐ.ఎస్.జగన్నాథపురానికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ద్వారకా తిరుమల, జంగారెడ్డి గూడెం నుంచి ప్రత్యేక సమయాల్లో బస్సులు కూడా ఉంటాయి. అయితే ఆలయం వరకూ బస్సులూ, ఆటోలూ వెళ్లవు. మెట్లమార్గం ద్వారా కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?