గచ్చిబౌలిలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఈనెల 20న 180 ఐసొలేషన్ గదులు ఉండగా, 21న సున్నాగా.. సికింద్రాబాద్‌లోని మరో కార్పొరేట్ ఆసుపత్రిలో 20న 97 ఐసొలేషన్ పడకలుండగా.. 21న సున్నాగా చూపించాయి. ఇలా దాదాపు 20కి పైగా ఆసుపత్రులు ఐసొలేషన్ పడకల్ని ఎత్తివేశాయి. రాష్ట్రంలో దాదాపు 80 శాతంమంది కొవిడ్ బాధితులు ఇళ్లలో ఉండే చికిత్స పొందుతున్నారు. లక్షణాలు తీవ్రమైన వారు, పరిస్థితి విషమించినవారు, ఇతర వ్యాధులు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో కొందరికి ఆక్సిజన్ సేవలు, ఎక్కువమందికి ఐసీయూలో సేవలు అవసరమవుతున్నాయి.
ఒక్కరోజులో 1,421 ఐసీయూ పడకలు
ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆక్సిజన్ సేవల్లో 806 పడకలను, ఐసొలేషన్‌లో 1,186 పడకలను తగ్గించి ఒక్కరోజులోనే 1,421 ఐసీయూ పడకలను పెంచాయి. మొత్తంగా రాష్ట్రంలో ఈనెల 20న అన్ని పడకలు కలుపుకొని 11,055 ఉండగా.. 21 నాటికి 10,484కు తగ్గాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఒక్కరోజులోనే 728 కొవిడ్ పడకలు పెరిగాయి. వీటిలో కొన్ని ఐసొలేషన్‌కు, కొన్ని ఆక్సిజన్ సేవలకు కేటాయించారు. ఆసుపత్రులు కూడా 45 నుంచి 62కు పెరిగాయి. ఐసీయూ పడకలను మాత్రం పెద్దగా పెంచలేదు. ఈనెల 20న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,224 ఐసీయూ పడకలుండగా.. 21 నాటికి 1,241కి పెరిగాయి. పడకల మార్పును బట్టి కొవిడ్ బాధితులు ఎటువంటి సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారో తెలుసుకోవచ్చని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
సైనిక పాఠశాలలో 11 మందికి కరోనా
చొప్పదండి, న్యూస్‌టుడే: కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ గురుకుల సైనిక పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు కలిపి 131 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారిని పాఠశాలలోనే ఐసొలేషన్‌లో ఉంచామన్నారు.
6 బోధనాసుపత్రుల్లో వైరాలజీ ల్యాబ్‌లు
రాష్ట్రంలోని 6 ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కొత్తగా వైరాలజీ ప్రయోగశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట ప్రభుత్వ వైద్యకళాశాలల్లో వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది.