షేక్‌పేట్ భూ వివాదంలో తహసీల్దార్ సుజాతను అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేయటం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భూవివాదం పరిష్కరిస్తానంటూ ఆర్‌ఐ నాగార్జునరెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఇంత పెద్దమొత్తంలో డబ్బు తీసుకోవటం వెనుక ఉన్నతస్థాయిలో సహకారం ఉండవచ్చనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో షేక్‌పేట్ మండల తహసీల్దార్ సుజాత ప్రమేయంపై ఏసీబీ అధికారులు సోమవారం కూడా సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినపుడు పోలీసు, రెవెన్యూ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించలేదనే నిర్ణయానికి వచ్చారు. నిందితుడికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవహారం నడిపినట్టు గుర్తించారు. ఈ కేసులో వీఆర్‌వో, ఆర్‌ఐ, తహసీల్దార్ ముగ్గురి ప్రమేయం ఉన్నట్టుగా తేల్చారు. తహసీల్దార్ సుజాతను సోమవారం కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు.
ఇన్‌ఛార్జిగా చంద్రకళ
ఫిలింనగర్: షేక్‌పేట మండల ఇన్‌ఛార్జి తహసీల్దారుగా అమీర్‌పేట మండల తహసీల్దారు చంద్రకళను జిల్లా కలెక్టర్ నియమించారు. త్వరలో చంద్రకళ బాధ్యతలు చేపట్టనున్నారు.
యంత్రాంగం ఉలికిపాటు
తహసీల్దార్ సుజాత అరెస్ట్‌తో రెవెన్యూ అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు. ఏసీబీ దాడుల్లో ఇంత పెద్దమొత్తంలో నగదు గుర్తించటం ఇది రెండోసారి. గతంలో తహసీల్దార్ లావణ్య నివాసంలో రూ.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు తహసీల్దార్ల వ్యవహారశైలిపై ఆరోపణలు రావటంతో కలెక్టర్ శ్వేతామహంతి గట్టిగా మందలించినట్లు సమాచారం.
తీరుమార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. మరో ముగ్గురు తహసీల్దార్లపై కూడా ప్రస్తుతం శాఖాపరమైన దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. మూడ్రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో కొందరు తహసీల్దార్లు సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలంటూ హితవు చెప్పారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, సిబ్బంది జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
- ఇదీ చూడండి : తహసీల్దార్ సుజాతను కస్టడిలోకి తీసుకునే అవకాశం!