Sky diving: 2011లో మాస్టర్ డిగ్రీ చేయడానికి అమెరికాలోని అరిజోనాకి వెళ్లాడు సుదీప్. అక్కడి విశ్వవిద్యాలయంలో స్కై డైవింగ్ చేసే కొందరు స్నేహితులు పరిచయమయ్యారు. వాళ్లను చూసి జీవితంలో ఒక్కసారైనా అంబరాన్ని చుంబించి కిందికి దూకాలనే ఆసక్తి పెంచుకున్నాడు. తనకి కొందరు మిత్రులు తోడయ్యారు. కానీ స్కై డైవింగ్ ఖరీదైన ఆట. శిక్షణ, ధ్రువపత్రం, విమానం అద్దె, లైసెన్స్ పొందడం.. అన్నింటికీ కలిపి దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చవుతోందని తెలిసి తమ ప్రయత్నం వాయిదా వేసుకున్నారు.
2013లో సుదీప్ ఉద్యోగంలో స్థిరపడ్డాక తొలిసారి ఆకాశాన్ని ముద్దాడాడు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకు ఏడువందల సార్లకుపైగా డైవింగ్ చేశాడు. పలు రికార్డులు సృష్టించాడు. ప్రతిష్ఠాత్మకమైన ‘డి’ లైసెన్స్ గ్రహీత అయ్యాడు. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా నిరభ్యంతరంగా స్కై డైవింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది.
ఒకవైపు మంచి జీతంతో ఐటీ కొలువు, మరోవైపు వైద్యురాలైన భార్య ప్రోత్సాహమూ తోడవడంతో నిరంతరాయంగా సాహసయాత్ర కొనసాగిస్తున్నాడు. తను కేవలం రికార్డులు సృష్టించడమే కాదు.. తన అపార అనుభవాన్ని అమెరికాలోని ప్రవాస భారతీయ యువతకు శిక్షణనివ్వడానికి ఉపయోగిస్తున్నాడు. వారాంతాల్లో రెండ్రోజులు పూర్తిగా దీనికే సమయం కేటాయిస్తున్నాడు. మరోవైపు ఈ సాహస క్రీడకి భారత్‌లో ప్రాచూర్యం తీసుకు రావడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.
‘ఇంటర్నేషనల్ స్కై డైవింగ్ కమిటీ’లో సభ్యుడిగా ఉంటూ భారత్ వాణి వినిపిస్తున్నాడు. షికాగోలో ఔత్సాహిక స్కై డైవర్లతో కలిసి ఓ సమావేశం నిర్వహించాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ క్రీడలో మేటి ఆటగాళ్లను తయారు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానంటున్నాడు. ఒలింపిక్స్‌లో స్కై డైవింగ్‌కి చోటు లేదు. కానీ ‘ఫెడరేషన్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంటర్నేషనల్’ (ఎఫ్‌ఏఐ) రెండేళ్లకోసారి పోటీలు నిర్వహిస్తుంటుంది.
ఇందులో పారాగ్లైడింగ్, పారా మోటారింగ్, ఫ్లయింగ్, స్కై డైవింగ్‌లాంటి.. రకరకాల క్రీడలు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇందులో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి పతకం గెలుస్తానంటున్నాడు సుదీప్.
www.instagram.com/thedesiflyer
* స్కై డైవింగ్‌లో వింగ్ సూట్ సాయంతో కిందికి దూకి నిర్దేశించిన ప్రదేశంలో ల్యాండ్ అవుతుంటారు. కానీ సుదీప్ 14వేల అడుగుల నుంచి దూకి 8.6 కిలోమీటర్లు ముందుకు ఎగురుకుంటూ వెళ్లాడు. ఇది రికార్డు.
* వేల అడుగుల నుంచి డైవింగ్ చేసిన తర్వాత 4 వేల అడుగులకి చేరువ కాగానే పారాచూట్ తెరుస్తుంటారు. సుదీప్ 2.5 వేల అడుగులకు వచ్చాకగానీ తెరవలేదు. ఇదీ రికార్డే.
* 2020లో అనేక వడపోతల అనంతరం అమెరికా మొత్తమ్మీద 43మంది డైవర్లను ఎంపిక చేశారు. వారితో ఒక క్రమపద్ధతిలో ‘ఫార్మేషన్’ విన్యాసం చేయించారు. ఇందులో ఒకరిగా ఎంపికైన ఘనత సాధించాడు.
* విమానం నుంచి చేస్తే స్కై డైవింగ్.. పర్వతాలు, ఆకాశహర్మ్యాల నుంచి చేస్తే బేస్ జంపింగ్ అంటారు. సుదీప్‌కి ఈ రెండింట్లోనూ ప్రావీణ్యం ఉంది.
‘జీవితానికి, స్కై డైవింగ్‌కి చాలా సారూప్యతలు ఉన్నాయి. ప్రారంభంలో రెండూ భయంగానే ఉంటాయి. ఒక్కసారి వాటిపై అదుపు, పైచేయి సాధిస్తే.. అనుభవం సొంతమైతే.. ప్రతి దశను, ప్రతి రైడ్‌ను ఆస్వాదించవచ్చు. ఇప్పటికీ మనదేశం ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలు వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్నే. దీంట్లో ప్రాతినిధ్యం దొరికితే భారత్‌కి తప్పకుండా మంచి పేరు వస్తుంది. 35వేల అడుగుల నుంచి డైవింగ్ చేయడం, భారత్‌ను అంతర్జాతీయ పోటీల్లో విజేతగా నిలపడమే నా లక్ష్యం’. -కొడవాటి సుదీప్
ఇదీ చదవండి : మోదీ జీ... భాజపా నేతల వ్యాఖ్యలకు దేశమెందుకు క్షమాపణ చెప్పాలి?: కేటీఆర్