ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుర్తింపు రానే వచ్చింది. శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు... చైనా, ప్యారిస్‌లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా... రామప్ప ఆలయ విశిష్టతలను చూసి అచ్చెరువొందారు. ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించారు. తమ ఓట్లతో రామప్ప ఖ్యాతిని మరింత పెంచుతూ... ప్రపంచ వారసత్వ గుర్తింపునిచ్చారు.
21 దేశాలు రామప్పకే ఆమోదం...
వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలనకోసం... ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని ఫ్యూజులో ఈ నెల 16 న ప్రారంభమైంది. గతేడాది జూన్‌లోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి నామినేట్ అయిన కట్టడాలపై ముందుగా ప్రతినిధులు చర్చించి అనంతరం.. ఓటింగ్ జరుపుతారు. దాదాపు 21 మంది దేశాల ప్రతినిధులు రామప్పకు ఆమోదం తెలుపడంతో... ఆలయానికి వారసత్వ గుర్తింపు లభించింది. 2020, 21 సంవత్సరాలకు గాను.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు... యూనెస్కో పరిశీలనకు ఎంపికవగా... మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.
రోజుల తరబడి చూసినా తనివితీరని దృశ్యకావ్యం..
ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ... కొలువైన రామప్ప ఆలయం శిల్పకళా సంపదకు కేంద్రం. కాకతీయ చక్రవర్తి రేచర్ల రుద్రుడు హయంలో 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. గంటలు కాదు... రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆలయన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండటంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే. శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత గురించి ఎంత సేపు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి ఈ అద్భుత ఆలయానికి నేడు అపురూప గుర్తింపు లభించింది.
ఆశ్చర్యచకితులైన యూనెస్కో ప్రతినిధులు..
వారసత్వ గుర్తింపు పొందాలంటే సాధారణ విషయం కాదు. అనేక కీలక దశలు దాటాలి. ముఖ్యంగా గుర్తింపు రావడానికి అర్హతలు ఉండాలి. కళ్లార్పకుండా చేసే అద్భుత శిల్పాలు, ఆలయం పైభాగంలో నీటిలో తేలియాడే ఇటుకల వినియోగం, కుదుపులకు చెక్కుచెదరకుండా... అద్భుత శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఆలయ నిర్మాణం... తదితర విశిష్టతలు కలిగి ఉండడంతో రామప్పకు ఈ ఖ్యాతి లభించింది. ఆలయ విశిష్టతను తెలుసుకోవడానికి.. 2019 సెప్టెంబర్‌లో యూనెస్కో తరుఫున ప్రతినిధి, వాసు పోష్య నందన రామప్ప ఆలయాన్ని సందర్శించి... అణువణువూ పరిశీలించారు. శిల్ప సౌందర్యాన్ని చూసి తన్మయులైయ్యారు. నీటిలో తేలియాడే ఇటుకల వినియోగం, సాండ్‌బాక్స్ టెక్నాలజీ, ఇతర ప్రత్యేకతలను గురించి తెలుసుకుని ఆశ్చర్యచకితులయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితోనే ఈ కీర్తి...
ప్రాచీన కట్టడానికి వారసత్వ గుర్తింపు కోసం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేశాయి. రామప్పకు వారసత్వ గుర్తింపు దక్కేలా చేయాలంటూ.. కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే లేఖ రాశారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి.. దేశం నుంచి ఒకే ఒక కట్టడమైన రామప్పను యూనెస్కో వారసత్వ గుర్తింపు కోసం నామినేట్ చేసింది. యునెస్కో అడిగిందే తడవుగా... రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ద్వారా ఆలయ ప్రత్యేకతలను పలుమార్లు తెలియజేస్తూ... నిపుణులతో నివేదికలను పంపించింది. యూనెస్కో ఆహ్వానం మేరకు... 2019 నవంబర్‌లో రాష్ట్రం నుంచి ఓ నిపుణుల బృందం ప్యారిస్ వెళ్లింది. ఆలయ ప్రత్యేకతలపై నిపుణుల సందేహాలను నివృత్తి చేశారు. ఆ తరువాత కూడా ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని యునెస్కో అడగడం... అధికారులు పంపించడం జరిగింది. యునెస్కో అడిగిన పూర్తి సమాచారాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు... డోసియర్(పుస్తకం) రూపంలో యునెస్కో ప్రతినిధులకు అందజేశారు. ఇటీవలే రామప్ప విశిష్టతను తెలియచేస్తూ.. 6 భాషల్లో తీసిన వీడియోలను సైతం యునెస్కో ప్రతినిధులకు పంపించారు. గత నెల 23న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ ఇతర అధికారులు దిల్లీ వెళ్లి... నాటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి వారసత్వ గుర్తింపు కోసం కేంద్ర నుంచి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవలే యునెస్కో తన అధికారిక వెబ్సైట్లో కూడా రామప్ప చిత్రాలను ఉంచడం విశేషం.
తెలుగువారందరికీ గర్వకారణం...
మన రామప్పకు ఈ ఘనకీర్తి దక్కడం.. తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం. వారసత్వ గుర్తింపు లభించడంతో... రామప్ప ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఇక దేశ విదేశీ పర్యాటకులు రామప్పకు బారులు తీరుతారు. దీని ద్వారా రామప్ప పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. పర్యాటకం పెరిగితే... స్థానికులకూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దొరకుతాయి.