IT Employees : కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ‘ఇంటి నుంచి పని’ చేస్తున్న ఐటీ ఉద్యోగులు త్వరలోనే కార్యాలయాలకు రానున్నారు. ఏప్రిల్ 1 నుంచి కార్యాలయాల్లో పనిచేసేందుకు సన్నద్ధం కావాలని ఐటీ సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి సందేశాలు పంపుతున్నాయి. రాష్ట్రంలో 1,500కు పైగా ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 6.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం 90 శాతం మంది వరకు ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీనివల్ల ఐటీ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాల ఉపాధిపై ప్రభావం పడింది. కార్యాలయాల్లో పనిని పునరుద్ధరిస్తే ఆ వర్గాల ఉపాధికి భరోసా వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మంది నగరానికి దూరంగా సొంతూళ్లలో ఉన్నారు. వారంతా తిరిగి వచ్చి, అద్దె ఇళ్లు వెతుక్కోవడం, వసతిగృహాల్లో చేరడానికి వీలుగా కంపెనీలు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాయి.
తొలుత వారానికి 2-3 రోజులు..
ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా ప్రాజెక్టుల వారీగా రప్పించాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఒక ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులందరినీ ఒకేసారి కాకుండా... గ్రూపులుగా విభజించనున్నాయి. తొలుత వారానికి 2-3 రోజులు కార్యాలయాల్లో, మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొంటున్నాయి.
ఐటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి..
కరోనాతో రెండేళ్లుగా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం కార్యాలయాలకు పది శాతం మంది వస్తున్నారు. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా కార్యాలయం నుంచి పని ప్రారంభించుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు వస్తారు.
- భరణికుమార్ ఆరోల్, హైసియా అధ్యక్షుడు
ఇదీ చూడండి : Pollution: నిబంధనలకు నీళ్లొదలిన ఫార్మా కంపెనీలు.. కాలుష్య కోరల్లో పల్లెలు