కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 16 లక్షల మందికిపైగా వైద్యసిబ్బంది,ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్ జరగ్గా... రాష్ట్రంలో 1,10,00,31 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బందికే టీకా ప్రక్రియ చేపట్టగా... ఇవాళ్టి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు.
టీకా సురక్షితమైంది: గవర్నర్
దేశంలో కోవిడ్-19 టీకా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు. టీకా సురక్షితమైందని ఎలాంటి అనుమానం లేకుండా టీకా తీసుకోవాలని గవర్నర్ సూచించారు . సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొవిడ్ వాక్సినేషన్‌ను గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. గతంలో ఇండియా కలరా వ్యాధిని ఎదుర్కొందని అదే స్ఫూర్తితో బృందంగా ఈ మహమ్మారిపై పోరాటం చేయాలని కోరారు.
కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ముందువరుసలో ఉండి పోరాడిన వైద్యసిబ్బంది, ఆరోగ్యకార్యకర్తలు, వైద్యవిద్యార్థులకు కృతజ్ఞతలు. ఇప్పుడు దేశ ప్రజలకు దేశీయ టీకాను అందిస్తున్నామన్న గర్వంతో 72వ గణతంత్ర వేడుకలను జరుపుకోబోతున్నాం. నేను ఎప్పుడు టీకాను తీసుకుంటారని అందరూ అడుగుతున్నారు. నేనూ సాధారణ పౌరురాలినే. పౌరులందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా తీసుకుంటాను. - తమిళిసై సౌందర రాజన్, గవర్నర్.
కొవిడ్‌ను దేశం నుంచి తరిమివేయవచ్చు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహించిన టీకా పంపిణీ కార్యక్రమంలో.. వైద్యులు, వైద్యసిబ్బంది టీకా తీసుకున్నారు. దేశంలో తయారైన కొవిడ్ టీకా సురక్షితమని దీనిపై ఎలాంటి అపోహలు అవసరంలేదని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఛైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి టీకా తీసుకున్న తర్వాత తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ యంవీ రావు సూచించారు. ఇతర వ్యాక్సిన్ల తరహాలోనే కొవిడ్ వ్యాక్సిన్‌ను సులభంగా తీసుకోవచ్చని ఆయన తెలిపారు. యశోదా ఆస్పత్రిలో టీకా వేయించుకున్న డాక్టర్ ఎంవీరావు... వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొవిడ్‌ను దేశం నుంచి తరిమివేయవచ్చని పిలుపునిచ్చారు.
టీకా తీసుకున్న ఎమ్మెల్యే..
ప్రైవేట్ వైద్యులు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ టీకా వేయించుకున్నారు. నేత్ర వైద్యుడిగా సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్.. జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకాపై ఎలాంటి భయందోళనలు అవసరం లేదని ప్రజలకు అవగాహన కల్పించాలని సంజయ్‌కుమార్ సూచించారు.
ఇవీ చూడండి: మొక్కలు నాటిన మోనాల్ గజ్జర్.. మరికొందరికి గ్రీన్ 'ఛాలెంజ్'