కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో వివిధ నేత్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఎల్‌వీ.ప్రసాద్ నేత్ర వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ నియంత్రణ, రక్తం గడ్డకుండా ఉండటానికి కొవిడ్ రోగులకు స్టెరాయిడ్లు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో చాలా మంది కోలుకుంటున్నారు. కొందరిలో 2 నుంచి 4 వారాల తర్వాత నేత్ర సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. స్టెరాయిడ్లతో కంటి చూపు మసకబారడం, ఎరుపెక్కడం, ఎదుట ఉన్న వస్తువు వంకరగా కనిపించడం వంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయని సీనియర్ రెటీనా కన్సల్టెంట్ డాక్టర్ రాజా నారాయణన్, సీనియర్ కార్నియా కన్సల్టెంట్ సునీత చౌరాసియా తెలిపారు. రోజూ తమ వద్దకు వచ్చే ప్రతి 200 మందిలో ఒకరు లేదా ఇద్దరిలో ఈ సమస్య ఉంటోందన్నారు. రెటీనా స్కాన్ చేస్తే సమస్యను గుర్తించవచ్చని, తగిన చికిత్సలూ ఉన్నాయన్నారు. వివరాలను సోమవారం వారు మీడియాకు తెలిపారు.
2 శాతం మందిలో..
మరి కొందరిలో స్టెరాయిడ్లతో సంబంధం లేకుండా రెటీనా వాపు సమస్య వస్తోందని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న నాలుగు వారాల్లో పలువురు ఈ సమస్య బారిన పడుతున్నారని తెలిపారు. ఇలాంటి వారు 2 శాతం ఉంటున్నారని వివరించారు.‘కొందరు కరోనా రోగుల్లో వివిధ శరీర భాగాల్లో రక్తం గడ్డకట్టే సమస్య ఉత్పన్నమవుతోందని స్పష్టం చేశారు. రెటీనల్ రక్త నాళాల్లో కూడా అడ్డంకి ఏర్పడటం లేదా రెటీనా వాపు రావడం గమనించామని.. ఇలాంటి వారు రెటీనోపతికి గురవుతున్నారని తెలిపారు.
ఇవీ చూడండి: 'కృత్రిమ మేధకు గ్లోబల్ హబ్‌గా భారత్ అవతరించాలి'