తిరుమలలోని ఆకాశగంగ ప్రాంతంలో హనుమ జన్మస్థల సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్య, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామిగోవిందదేవ్ గిరి, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వరశర్మ, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పాల్గొన్నారు.
తిరుమలలోని అంజనాద్రిలో హనుమజన్మస్థల అభివృద్ధికి అంతా సహకరించాలని పలువురు పీఠాధిపతులు కోరారు. "ఆంజనేయ స్వామివారి జన్మస్థలం అంజనాద్రి- తిరుమల" పేరిట రాసిన పుస్తకాన్ని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద గిరి ఆవిష్కరించారు. వేల ఏళ్ల క్రితం జన్మించిన హనుమ స్థలం నిర్ధరించడం కష్టమన్న ఆయన.. ఆలయం ఎక్కడ నిర్మించినా అంగీకరించాలని కోరారు. అంజనాద్రి అభివృద్ధికి ఇతర రాష్ట్రాల వారి అంగీకారం అవసరమా? అని స్వరూపానందేంద్రస్వామి ప్రశ్నించారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో ధార్మిక సదస్సు నిర్వహించాలని.. తితిదేని కోరారు.
ఇదీచూడండి: Medaram Jatara 2022: జనసంద్రంగా మేడారం.. దర్శనానికి రెండు గంటల సమయం