రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని పీజీ వైద్య సీట్ల భర్తీ(medical pg seats in telangana 2021)లో ఇన్‌సర్వీస్ కోటాను ప్రభుత్వం ఖరారు చేసింది. మూడేళ్ల కిందట నిలిపివేసిన ఈ కోటాను పునరుద్ధరించింది. క్లినికల్ విభాగంలో 20 శాతం సీట్లను, ప్రీ, పారా క్లినికల్ విభాగంలో 30 శాతం సీట్లను కేటాయిస్తూ తాజాగా వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లోనే దీన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో... పీజీ వైద్య సీట్ల భర్తీ(medical pg seats in telangana 2021)కి శుక్రవారం ఇచ్చిన ప్రవేశ ప్రకటనలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజర్వేషన్ విధానాన్ని పొందుపర్చింది.
తాజా ఉత్తర్వుల్లో కేవలం ప్రభుత్వ వైద్యకళాశాలల్లోని కన్వీనర్ సీట్లకు మాత్రమే ఇన్‌సర్వీస్ కోటాను వర్తింపజేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో సగం సీట్లను అఖిల భారత కోటాలోకి బదిలీ చేస్తారు. మిగిలిన సీట్లలో 20 శాతం క్లినికల్ అంటే సుమారు 120 పీజీ సీట్లు, 30 శాతం ప్రీ, పారా క్లినికల్ విభాగంలో అంటే 80 సీట్లు ఇన్‌సర్వీస్ కోటాకు అందుబాటులో ఉంటాయని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న ఎంబీబీఎస్ వైద్యులకు ఈ కోటా వర్తిస్తుంది.
ఇన్‌సర్వీస్ కోటాలో సీట్లు పొందాలన్నా నీట్ పీజీ(neet pg 2021)లో అర్హత తప్పనిసరి. 2021-22 వైద్య విద్య సంవత్సరానికి ఇన్‌సర్వీస్ కోటాలో క్లినికల్, ప్రీ, పారా క్లినికల్ విభాగాలు కలుపుకొని మొత్తంగా సుమారు 200 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, అయితే ఎంబీబీఎస్ అర్హతతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు మాత్రం 68 మంది మాత్రమే ఉన్నారని, దీంతో నీట్‌లో అర్హత సాధించిన వారికి కూడా ఈ ఏడాది పీజీ సీట్లు లభిస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ వైద్యుల నుంచి మిశ్రమ స్పందన
ఇన్‌సర్వీస్ కోటా(medical pg seats in telangana 2021)పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రభుత్వ వైద్యుల్లో మిశ్రమ స్పందన లభించింది. ప్రభుత్వ వైద్యంలో సేవలందిస్తున్న వైద్యులకు ఉన్నత విద్యాభ్యాస అవకాశాన్ని కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(ప్రజారోగ్య సంచాలకుల విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం మాత్రం ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించింది. గ్రామీణ వైద్యంలో విశేష సేవలందిస్తున్న వైద్యులకు క్లినికల్‌లో 30 శాతం, ప్రీ, పారా క్లినికల్ విభాగాల్లో 50 శాతం చొప్పున గతంలో మాదిరిగానే రిజర్వేషన్లను వర్తింపజేయాలని ఆ సంఘం రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ డిమాండ్ చేశారు.