కరోనా నియంత్రణకు రాష్ట్ర విపత్తుల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ మండలి మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 2018లో రూపొందించిన విపత్తుల ప్రణాళిక, వడగాల్పుల మృతులను తగ్గించడంలో సత్ఫలితాలనిచ్చిందని వివరించింది.
గ్రామస్థాయి వరకు...
విపత్తుల ప్రణాళిక ద్వారానే కరోనా నియంత్రణ మార్గదర్శకాలను గ్రామస్థాయి వరకు అమలు చేయగలిగినట్లు తెలిపింది. మహిళ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, కార్మిక, రెవెన్యూ, రవాణ శాఖలు, ఎన్జీవోలు, ఇతర పౌర బృందాల సాయంతో సమర్థంగా కార్యకలాపాలు చేపట్టినట్లు హైకోర్టుకు సర్కారు తెలిపింది. అవసరాలకు అనుగుణంగా నిధులను సమకూర్చి అందరికీ చేయూతనిచ్చినట్లు నివేదించింది.
మూడున్నర లక్షల మందికి...
సుమారు మూడున్నర లక్షల మందికి రోజు వారీగా ఆహార పదార్థాలు, నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వలస కార్మికులకు 270 క్యాంటిన్ల ద్వారా ఉచిత భోజనం ఏర్పాటు చేసి ఉచితంగా స్వస్థలాలకు చేరవేసినట్లు వివరించింది.
అదనపు బడ్జెట్..
మందులు, పీపీఈ కిట్లు, పరీక్షల కిట్లకు అదనపు బడ్జెట్‌ను కేటాయించామని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. మహిళా శిశు సంక్షేమశాఖ, జీహెచ్ఎంసీ, విద్య, ప్రజారోగ్య, పంచాయతీరాజ్, పురపాలక శాఖల వారీగా రోడ్ మ్యాప్ రూపొందించి విపత్తును ఎదుర్కొని ప్రమాదాన్ని తక్కువ చేసినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: ముగిసిన గ్రేటర్ పోలింగ్.. ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్