రాష్ట్రంలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 28న నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించింది.
బిహార్.. దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రాగల 24 గంటల్లో ఇది తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశముంది. మధ్య మహారాష్ట్ర నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం