దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. ఎన్నికల బాధ్యతల్లో భాగంగా గ్రామాలకు ఇంఛార్జీలుగా వెళ్లుతున్న వారు... సర్పంచ్ ఎన్నికలకు ఎలా పనిచేస్తారో.. ఇప్పుడు కూడా అలానే పనిచేయాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన మాణిక్కం ఠాగూర్ సుమారు నాలుగు గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు.
దుబ్బాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు, 146 గ్రామాలకు ఇంఛార్జీలను ప్రకటించిన ఠాగూర్.. గ్రామాల్లో నాయకుల పనితీరు స్పష్టంగా కనిపించాలన్నారు. దుబ్బాకలో బాగా పనిచేయగలిగితే ఆ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. విజయం ప్రభావం రాబోయే మండలి, కార్పొరేషన్ ఎన్నికలపై ఉంటుందన్నారు.
ఇంఛార్జీలు ఈనెల ఏడో తేదీ నుంచి 11వ వరకు గ్రామాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. 12 నుంచి వారం రోజులపాటు సంతకాల సేకరణ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై పనిచేయాలని పార్టీ నాయకులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఓటర్ల నమోదు, సంతకాల సేకరణ కార్యక్రమాలను.. పార్టీ కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేయాలన్నారు. వారానికి కనీసం మూడు మండలాలు పర్యటించి ఈ రెండు కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.
రాహుల్, ప్రియాంక గాంధీలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా సత్యాగ్రహ దీక్షలు చేయాలని సూచించారు. సోమవారం.. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు దీక్షల్లో పాల్గొనాలని సూచించారు.
ఇవీచూడండి: సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలి: ఉత్తమ్