IAS officers Transfer in AP : ఏపీలో ఐఏఎస్ అధికారులకు స్థానచలనం జరిగింది. సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. జలవనరుల శాఖ నుంచి ఆయన్ను రిలీవ్ చేస్తూ సీఎం స్పెషల్ సీఎస్ గా నియమించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగానూ కొనసాగనున్నారు.
8 IAS officers Transfer in AP : ప్రస్తుతం సీసీఎల్ఏగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌ను అటవీ పర్యావరణ,సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ స్థానంలో ఉన్న విజయకుమార్‌ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఏపీ ప్రణాళికా విభాగం సీఈఓగానూ పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. సీసీఎల్ఏగా జి. సాయిప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ భూరికార్డులు, విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.
AP IAS officers Transfer : ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవకు యువజన సర్వీసులు, క్రీడలశాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఆర్ధికశాఖ హెచ్‌ఆర్ విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు సాధారణ పరిపాలనశాఖ హెఆర్ సర్వీసుల విభాగం ముఖ్యకార్యదర్శిగానూ అదనపు బాధ్యతలూ అప్పగించారు.
ఏపీపీఎస్సీ కార్యదర్శి, రవాణాశాఖ కమిషనర్ పోస్టుల నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను ప్రభుత్వం రిలీవ్ చేసింది. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకు రవాణాశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఎండీగా ఉన్న బాబుకు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.