గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు రూ.1900 కోట్ల వరకు గృహ, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోయాయని జలమండలి చెబుతోంది. ఈ నేపథ్యంలో వడ్డీ మాఫీ చేయనుండటంతో వసూలవుతాయని ఆశలు పెట్టుకుంది. వడ్డీ మాఫీలో భాగంగా రూ.2 వేల వరకు మేనేజరు, రూ.2001 నుంచి రూ.10 వేల వరకు డిప్యూటీ జీఎం, రూ.10 వేలు మించి దాటితే జీఎం నిర్ణయం తీసుకునే అధికారం ఉందని జీవోలో స్పష్టంచేశారు. ఇప్పటివరకు పేరుకుపోయిన బకాయిలపై దాదాపు 18 శాతంపైనే వడ్డీ వసూలు చేస్తోంది. కొన్ని బిల్లులపై అసలు కంటే వడ్డీ ఎక్కువ. ఈ మొత్తం మాఫీ కానుండటంతో చాలామంది స్వచ్ఛందంగా చెల్లిస్తారని అంచనా వేస్తున్నారు.
గుదిబండగా మారి..
ప్రభుత్వ శాఖల నుంచి నీటి బిల్లుల వసూళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖలు అత్యధికంగా బకాయిలు పడినట్లు జలమండలి పేర్కొంటోంది. గ్రేటర్ వ్యాప్తంగా 10 లక్షల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహాలతోపాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు బల్క్‌గా నీటిని సరఫరా చేస్తోంది. ఆయా సంస్థలకు ప్రతి నెలా లక్షల్లో బిల్లులు వస్తుంటాయి. బడ్జెట్ రాలేదని చెల్లింపులో అవి ఆలస్యం చేస్తున్నాయి. మరోవైపు జలమండలి వివిధ పనులకు రుణాలు తీసుకుంటోంది. కృష్ణా మూడు దశలకు, గోదావరి, శివారు మున్సిపాలిటీల్లో నీటి సరఫరా వ్యవస్థకు రూ.వేల కోట్ల అప్పులు చేసి వడ్డీలు కడుతోంది. రావాల్సిన నీటి బిల్లులపై దృష్టిసారిస్తే నిధుల సమస్య తీరే అవకాశం ఉంది.
ప్రతి నెలా జలమండలి లోటు బడ్జెట్‌ను ఎదుర్కొంటోంది. ఏటా నీటి బిల్లులు, కొత్త కనెక్షన్ల ద్వారా సుమారు రూ.1000 కోట్లు సమకూరుతోంది. కరోనా దెబ్బతో ఆదాయం పూర్తిగా తగ్గింది. ఇప్పటికే ఏటా రూ.400-500 కోట్ల వరకు లోటు ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు.
అత్యధిక నీటి బిల్లులు బకాయి పడ్డ శాఖలివే..
పంచాయతీరాజ్
మిషన్ భగీరథ
కేంద్ర ప్రభుత్వ సంస్థలు
వైద్య ఆరోగ్యశాఖ
ఉన్నత విద్యాశాఖ
పోలీస్‌శాఖ
గృహనిర్మాణ శాఖ
పురపాలక శాఖ
పబ్లిక్ సెక్టార్ యూనిట్లు
రోడ్లు, భవనాల శాఖ
10లక్షలు..
గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న నల్లా కనెక్షన్లు
రూ.1200 కోట్లు..
ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన నీటి బిల్లుల బకాయిలు
రూ.700 కోట్లు..
గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల బకాయిలు